ప్రతీ మ్యాచ్‌ కీలకమే

10 Jul, 2021 05:05 IST|Sakshi

 ఒలింపిక్స్‌ ‘డ్రా’పై సింధు వ్యాఖ్య

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ‘డ్రా’ను బట్టి చూస్తే తనకు కొంత సులువుగానే అనిపిస్తున్నా... ప్రతీ దశలో పాయింట్ల కోసం పోరాడక తప్పదని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వ్యాఖ్యానించింది. గత రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు, ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ‘డ్రా’లో గ్రూప్‌ ‘జె’లో ఉన్న సింధు... చెంగ్‌ గాన్‌ యి (హాంకాంగ్‌), సెనియా పొలికరపోవా (ఇజ్రాయెల్‌)లతో తలపడాల్సి ఉంది. గ్రూప్‌ టాపర్‌గా నిలిచి ముందంజ వేస్తే ఆపై నాకౌట్‌ మ్యాచ్‌లు ఎదురవుతాయి. ‘గ్రూప్‌ దశలో నాకు మెరుగైన ‘డ్రా’ ఎదురైంది. హాంకాంగ్‌ అమ్మాయి బాగానే ఆడుతుంది. అయితే ప్రతీ ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. నేనూ బాగా ఆడగలనని నమ్ముతున్నా. ప్రతీ మ్యాచ్‌ కీలకమే కాబట్టి తర్వాతి దశ ప్రత్యర్థుల గురించి కాకుండా ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడతా. ఒలింపిక్స్‌ అంటేనే ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించక తప్పదు’ అని సింధు అభిప్రాయపడింది.  

పురుషుల సింగిల్స్‌లో పోటీ పడుతున్న సాయిప్రణీత్‌ తన ‘డ్రా’ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. మరీ కఠినంగా గానీ మరీ సులువుగా గానీ ఏమీ లేదని... విజయం కోసం 100 శాతం ప్రయత్నిస్తానని అతను చెప్పాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిలకు కఠిన ‘డ్రా’ ఎదురైనా... గెలవగల సత్తా తమకుందని డబుల్స్‌ కోచ్‌ మథియాస్‌ బో అన్నాడు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ పోటీలు ఈ నెల 24 నుంచి జరుగుతాయి.

ఒలింపిక్స్‌ సన్నాహాలపై ప్రధాని సమీ„ý  
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం సన్నాహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టోక్యో విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్లకు అందిస్తున్న సౌకర్యాలు, వివిధ క్రీడాంశాలకు ఇస్తున్న సహకారంలతో పాటు ప్రయాణ ఏర్పాట్లు, వ్యాక్సినేషన్‌ స్థితి తదితర అంశాలపై మోదీ సుదీర్ఘంగా సమీక్షించారు. టోక్యో వెళ్లే ఆటగాళ్లతో ప్రధాని ‘వర్చువల్‌’ పద్ధతిలో ఈ నెల 13న భేటీ కూడా కానున్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లతో తాను సంభాషించబోతున్నానని మోదీ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్‌ జరగనుండగా... భారత తొలి బృందం ఈ నెల 17న ప్రత్యేక విమానంలో టోక్యో వెళుతుంది.     

మరిన్ని వార్తలు