PV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్‌కు తరలింపు 

28 Jul, 2022 18:17 IST|Sakshi

కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత బృందానికి సంబంధించి ఓ షాకింగ్‌ వార్త బయటకు వచ్చింది. ఓపెనింగ్‌ సెర్మనీలో  పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు భారత ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించాల్సిన  బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు కోవిడ్‌ బారినపడినట్లు ప్రచారం జరుగుతుంది. సింధుకు సంబంధించిన ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో తొలుత కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆతర్వాత మళ్లీ జరిపిన టెస్ట్‌లో ఫలితం మరోలా ఉందని, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఎటు తేల్చుకోలేక ముందు జాగ్రత్తగా సింధును ఐసోలేషన్‌కు తరలించారని సమాచారం. 

సింధు విషయంలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని భారత బృందానికి చెందిన ఓ కీలక వ్యక్తి నిర్ధారించారు. సింధుకు మరోసారి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేశారని.. అందులో నెగిటివ్‌ ఫలితం వచ్చాకే ఆమెను కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అనుమతిస్తామని సదరు వ్యక్తి తెలిపాడు. 

కాగా, భారత బృందంతో పాటు పీవీ సింధు జులై 25న హైదరాబాద్ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫ్లైట్‌ ఎక్కడానికి ముందు, ఆతర్వాత లండన్‌లో ల్యాండయ్యాక జరిపిన కోవిడ్‌ పరీక్షల్లో సింధును నెగిటివ్‌ రిపోర్టే వచ్చింది. అయితే ఇవాళ సింధుకు కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉండటంతో పరీక్ష నిర్వహించారని, అందులో ఫలితం కన్‌ఫ్యూజింగ్‌గా వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కామన్‌వెల్త్‌ క్రీడల ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్‌ సెర్మనీ) భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకల్లో మన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు పీవీ సింధు 214 మంది సభ్యుల భారత బృందానికి ప్రతినిధిగా త్రివర్ణపతాకాన్ని చేతపట్టుకొని ముందుండి నడిపించాల్సి ఉంది.
చదవండి: పీవీ సింధుకు అరుదైన గౌరవం

మరిన్ని వార్తలు