సింధు, శ్రీకాంత్‌ జోరు

6 Mar, 2021 06:02 IST|Sakshi

బాసెల్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ సాధించే దిశగా భారత స్టార్‌ షట్లర్స్‌ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ మరో అడుగు వేశారు. స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. 13వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌పన్‌ (థాయ్‌లాండ్‌)తో 59 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–16, 23–21తో గెలిచింది. బుసానన్‌పై సింధుకిది 12వ విజయం కావడం విశేషం. కాంతాపోన్‌ వాంగ్‌చరోయిన్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21–19, 21–15తో నెగ్గాడు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత ఆటగాళ్లు సాయిప్రణీత్‌ 14–21, 17–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... అజయ్‌ జయరామ్‌ 9–21, 6–21తో కున్లావుత్‌ విదిత్‌సరన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)తో సింధు; విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో శ్రీకాంత్‌ ఆడతారు.

డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌ జంట
పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 12–21, 21–19, 21–12తో ఒంగ్‌ యెవ్‌ సిన్‌–తియో ఈ యి (మలేసియా) జోడీపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 17–21, 21–16, 18–21తో తాన్‌ కియాన్‌ మెంగ్‌–లాయ్‌ పె జింగ్‌ (మలేసియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశం

>
మరిన్ని వార్తలు