సయ్యద్‌ మోదీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి

18 Jan, 2022 07:30 IST|Sakshi

లక్నో: రెండున్నరేళ్లుగా లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను తీర్చుకునేందుకు భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు మరో ప్రయత్నం చేయనుంది. నేడు మొదలయ్యే సయ్యద్‌ మోదీ ఓపెన్‌ సూపర్‌–300 టోర్నీలో సింధు మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించిన తర్వాత సింధు మరో అంతర్జాతీయ టైటిల్‌ను గెలవలేకపోయింది. గతవారం ఇండియా ఓపెన్‌ టోర్నీలో సింధు సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. సయ్యద్‌ మోదీ ఓపెన్‌ లో టాప్‌ సీడ్‌గా పోటీపడుతున్న సింధు తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌తో తలపడనుంది.

ఇండియా ఓపెన్‌ సెమీఫైనల్లో తనను ఓడించిన థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి సుపనిదతో సింధు ఈసారి క్వార్టర్‌ ఫైనల్లో పోటీపడే అవకాశముంది. సుపనిదపై సింధు గెలిస్తే ఆమె దారిలో మరో కఠిన ప్రత్యర్థి లేరనే చెప్పాలి. భారత్‌కే చెందిన మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో తెలుగమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, మామిళ్లపల్లి తనిష్క్, సామియా ఫారూఖీ, చుక్కా సాయి ఉత్తేజిత రావు, రుత్విక శివాని కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతవారం ఇండియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన లక్ష్య సేన్‌... పురుషుల డబుల్స్‌ టైటిల్‌ సాధించిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట సయ్యద్‌ మోదీ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. 
చదవండి: లీగ్‌ మధ్యలో చెక్కేసిన పాకిస్థాన్‌ క్రికెటర్లు

మరిన్ని వార్తలు