సింధు శుభారంభం

20 Oct, 2021 05:29 IST|Sakshi

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు (భారత్‌) 21–12, 21–10తో నెస్లిహాన్‌ యిగిట్‌ (టర్కీ)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై నెగ్గగా... సమీర్‌ వర్మ 21–17, 21–14తో కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ధ్రువ్‌ ద్వయం 14–21, 21–17, 21–18తో ప్రపంచ 25వ ర్యాంక్‌ జోడీ హూ పాంగ్‌ రోన్‌–చె యి సీ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 23–21, 21–15తో హెమింగ్‌ –స్టాల్‌వుడ్‌ (ఇంగ్లండ్‌)లపై, అర్జున్‌–ధ్రువ్‌ 21–19, 21–15తో బెన్‌ లేన్‌–సీన్‌ వెండీ (ఇంగ్లండ్‌)లపై నెగ్గగా... సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి 18–21, 11–21తో గోసెఫె –నూరు జుద్దీన్‌ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. 

మరిన్ని వార్తలు