సింధు ట్వీట్‌ స్మాష్‌

3 Nov, 2020 06:59 IST|Sakshi

‘ఐ రిటైర్‌’ పదంతో ఉలిక్కిపడిన క్రీడాలోకం

న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్‌తో భారత క్రీడాభిమానులకు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ‘డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి టోర్నీ. నేను రిటైరయ్యా’ అని సింధు చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఆ ట్వీట్‌తో పాటు కోవిడ్‌–19 స్థితిగతులు, దాని ప్రభావంపై ఆమె సుదీర్ఘ ప్రకటన చేసింది. దీంతో కరోనా నేపథ్యంలో నిజంగానే ఆమె ఆటకు దూరంగా వెళ్తుందేమోనని అందరూ బోల్తా పడ్డారు. కానీ ట్వీట్‌ చివర్లో నెగెటివిటీ, అనవసరపు విశ్రాంతి, భయం నుంచి తాను రిటైర్‌ అవుతున్నానని ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కాలంగా అనవసరపు అనిశ్చితితో బాధపడుతున్నానని, ఇక దానికి స్వస్తి పలుకుతానంటూ ఆమె ట్వీట్‌ను మొదలుపెట్టింది.

‘ఆటలో ఇన్నాళ్లూ పోరాడాను. కానీ కంటికి కనిపించని ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియట్లేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో కథనాలు చదువుతూ ఇంటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఆలోచించా. కానీ ఈ అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. భయం, నెగెటివిటీ, అవాస్తవికతకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. పోరాడకుండా నేనెప్పుడూ ఓటమి ఒప్పుకోను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించకుండా ఉండటం డెన్మార్క్‌ ఓపెన్‌తోనే ముగిస్తున్నా’ అని ఇకపై ఆడతాననే తన అభిలాషను సింధు విశ్లేషణాత్మకంగా వివరించింది. దీనిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ ‘సింధు! నాకు మినీ షాక్‌ ఇచ్చావ్‌. కానీ నాకు నీ అకుంఠిత దీక్ష, సంకల్పంపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి ఇంకా ఎన్నో పురస్కారాలు అందిస్తావనే విశ్వాసం ఉంది’ అని రిజిజు ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు