ఆ గెలుపే కీలక మలుపు

27 Jul, 2020 02:37 IST|Sakshi

ఒలింపిక్‌ చాంపియన్‌ లీ జురుయ్‌పై విజయాన్ని గుర్తు చేసుకున్న పీవీ సింధు

ముంబై: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించిన హైదరాబాద్‌ అమ్మాయి, ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు... 2012లో సాధించిన ఓ గెలుపు తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిందని గుర్తు చేసుకుంది. చైనా ఓపెన్‌ సందర్భంగా నాటి లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ని ఓడించడం తన ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసిందని చెప్పింది. సీనియర్‌ విభాగంలో అప్పటివరకు తొలి రౌండ్, క్వాలిఫయర్స్‌లో ఎదురైన ఓటములతో ఆవరించిన నిరాశ ఆ మ్యాచ్‌ గెలుపుతో ఎగిరిపోయిందని తన కెరీర్‌ తొలినాళ్లను తలుచుకుంది.

నాడు 16 ఏళ్ల సింధు 2012 చైనా మాస్టర్స్‌ టోర్నీ క్వార్టర్స్‌లో లీ జురుయ్‌పై అద్భుత విజయాన్ని సాధించి వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో తన సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 5 ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలతో పాటు, ఒలింపిక్స్‌ రజతం ఉంది. ‘ఇన్‌ ద స్పోర్ట్‌లైట్‌’ షో సందర్భంగా టీటీ ప్లేయర్‌ ముదిత్‌ డానీతో  సింధు పలు అంశాలపై ముచ్చటించింది.

పొరపాటేంటో తెలిసేది కాదు... 
తొలి నాళ్లలో నా ఆట బాగానే ఉండేది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగకపోయేది. తరచుగా క్వాలిఫయింగ్‌ , తొలి రౌండ్లలోనే ఓడిపోయేదాన్ని. ఇంకా కష్టపడాలేమో అనుకొని తీవ్రంగా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అయినా ఓటములు ఎదురయ్యేవి. చాలా నిరాశగా ఉండేది. నా పొరపాటేంటో అర్థమయ్యేది కాదు. మిగతా వారిలాగే కష్టపడ్డా గెలుపు మాత్రం అందకపోయేది.

దృక్పథం మారిందలా... 
2012లో లండన్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ చాంపియన్‌ లీ జురుయ్‌పై గెలవడంతో నా దృక్పథం మొత్తం మారిపోయింది. నా కెరీర్‌లో అదే టర్నింగ్‌ పాయింట్‌. నాటి నుంచి ప్రతీరోజు, ప్రతీ ఏడాదీ నా ఆటను మెరుగు పరుచుకుంటూనే ఉన్నా.

బహుమతిగా అభిమాని నెలజీతం... 
రియోలో నా ప్రదర్శన మెచ్చి నేను హైదరాబాద్‌ రాగానే ఒకతను తన నెల జీతాన్ని బహుమతిగా ఇవ్వడం ఇంకా గుర్తుంది. అతని అభిమానానికి గుర్తుగా ఒక లేఖతో పాటు కొంత డబ్బు అతనికి పంపించా.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా