టైటిల్‌కు విజయం దూరంలో...

7 Mar, 2021 05:22 IST|Sakshi

స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో పీవీ సింధు

నేడు కరోలినా మారిన్‌తో అమీతుమీ

బాసెల్‌: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకోవడానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 22–20, 21–10తో ప్రపంచ 11వ ర్యాంకర్‌ మియా బ్లిచ్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్న సింధు రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ గెలుపుతో గత జనవరిలో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టోర్నీలో మియా చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకున్నట్లయింది. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో సింధు ఆడుతుంది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–8తో వెనుకబడి ఉంది. భారత కాలమానం ప్రకారం సింధు–మారిన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రాత్రి 7 గంటల తర్వాత మొదలయ్యే అవకాశముంది.  

శ్రీకాంత్‌ పరాజయం
పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 13–21, 19–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట 10–21, 17–21తో కిమ్‌ అస్‌ట్రప్‌–ఆండెర్స్‌ రస్‌ముసెన్‌ (డెన్మార్క్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది.  

మరిన్ని వార్తలు