సింధు వేట మొదలైంది

26 Jul, 2021 05:01 IST|Sakshi

తొలి మ్యాచ్‌లో సునాయాస విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుభారంభం చేసింది  రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, వరల్డ్‌ చాంపియన్‌ సింధు తన ‘జె’ గ్రూప్‌ తొలి మ్యాచ్‌లో 21–7, 21–10 స్కోరుతో సెనియా పొలికర్పొవా (ఇజ్రాయెల్‌)ను చిత్తుగా ఓడించింది. 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. భారత స్టార్‌ షట్లర్‌ ముందు ప్రత్యర్థి తేలిపోయింది. తొలి గేమ్‌ను నెమ్మదిగా ప్రారంభించి 3–4తో వెనుకబడినా... ఆ వెంటనే కోలుకున్న సింధు దూసుకుపోయి 11–5తో నిలిచింది.

ఒకదశలో సింధు వరుసగా 13 పాయింట్లు సాధించడం విశేషం. రెండో గేమ్‌లో కూడా సింధు 9–3తో ముందంజ వేసి బ్రేక్‌ సమయానికి 11–4తో నిలిచింది. ఈ స్థితిలో పొలికర్పొవా మొదటి గేమ్‌కంటే కాస్త మెరుగ్గా ఆడుతూ పోటీనిచ్చే ప్రయత్నం చేసింది. అయితే సింధు పదునైన క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు, డ్రాప్‌ షాట్‌లతో విజయం దిశగా పయనించింది. ‘జె’ గ్రూప్‌లో తన తర్వాతి మ్యాచ్‌లో చెంగ్‌ గాన్‌ యి (హాంకాంగ్‌)తో సింధు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

తొలి మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచా. అయితే నేనేమీ ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోలేదు. బలహీన ప్రత్యర్థే అయినా పూర్తి సామర్థ్యంతోనే ఆడాలి. ఎందుకంటే ఒక్కసారిగా బలమైన ప్రత్యర్థి ఎదురైతే స్ట్రోక్స్‌ కొత్తగా అనిపించవచ్చు. రియో రజతం తర్వాత కూడా గత ఐదేళ్లలో ఎంతో కష్టపడ్డాను. దాని ఫలితం రాబట్టేందుకు ఇదే సరైన సమయం. రియో ఘనత ముగిసిపోయిది. ఈ ఒలింపిక్స్‌ మరో కొత్త ఆరంభం. స్టేడియంలో అభిమానులు లేకపోవడం నిరాశ కలిగించినా మన దేశంలో ఎందరో నాకు మద్దతు తెలుపుతూ నా విజయాన్ని ఆకాంక్షిస్తుండటం సంతోషకరం. –పీవీ సింధు

మరిన్ని వార్తలు