సింధు... కాంస్యంతో సరి

1 May, 2022 06:30 IST|Sakshi

సెమీస్‌లో పోరాడి ఓడిన భారత స్టార్‌

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయింది.

ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–13, 19–21, 16–21తో పోరాడి ఓడింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో స్కోరు 19–19తో సమంగా ఉన్న కీలకదశలో సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో అకానె యామగుచి ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అకానె గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.  సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీ, 8,400 పాయింట్లు లభించాయి.

ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు లభించిన పతకాలు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్‌ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు.

మరిన్ని వార్తలు