Tokyo Olympics: తెలుగు తేజం పీవీ సింధు కొత్త చరిత్ర

2 Aug, 2021 03:00 IST|Sakshi

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో కాంస్యం సొంతం

మూడో స్థానం కోసం పోరులో బింగ్‌జియావోపై విజయం 

వరుసగా రెండో విశ్వ క్రీడల్లోనూ పతకం

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు   

మన బంగారానికి... కాంస్యం
ఒలింపిక్స్‌ విశ్వవేదికపై సింధు మరోసారి మెరిసింది.. బంగారం దక్కలేదనే బెంగ తీరుస్తూ కంచుతోనే కొత్త చరిత్ర మోగిస్తూ భారత అభిమానులకు అమితానందాన్ని పంచింది. టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని అందుకొని సింధు అద్భుత ఘనతను తన పేరిట లిఖించుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు మూడో స్థానంతో మరో పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ  ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది.  2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించి రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ మాత్రమే గతంలో ఈ అరుదైన ఘనత సాధించాడు. సెమీఫైనల్లో ఓటమితో వేదనకు గురైనా... కొత్త ఉత్సాహంతో ఆదివారం బరిలోకి దిగిన సింధు 21–13, 21–15తో చైనా షట్లర్‌ బింగ్‌ జియావోను చిత్తు చేసింది. ఇప్పటికే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణంతో సహా ఐదు పతకాలు గెలుచుకున్న సింధు... రెండు ఒలింపిక్‌ పతకాలతో భారత క్రీడా చరిత్రలో ఎవరినీ అందనంత ఎత్తులో శిఖరాన నిలిచింది.  

 

ఫైనల్‌ చేరనందుకు బాధపడాలా? కాంస్యం సాధించినందుకు సంతోషించాలా? మ్యాచ్‌లో గెలిచిన తర్వాత సింధు మనసులో మాట ఇది! ఆనందం, దుఃఖం కాదు... సింధు తన ప్రదర్శనతో గర్వపడాలి. ఫలితంతో సంబంధం లేకుండా ఒలింపిక్స్‌లో ఒక్కసారి పాల్గొంటే చాలు జీవితకాలం ఒలింపియన్‌ గుర్తింపుతో ఉండేవారు కొందరైతే... ఒక్క పతకం సాధిస్తే చాలు చరిత్రలో తమ పేరుతో చిరంజీవిగా మిగిలిపోయేవారు మరికొందరు. కానీ మన పూసర్ల వెంకట (పీవీ) సింధు అందరినీ మించి శిఖరాన నిలిచింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు సాధించి ఈ ఘనత అందుకున్న రెండో భారతీయురాలిగా నిలిచింది. 26 ఏళ్ల అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర ఇది. టోక్యోకు వెళ్లే ముందు లక్ష్యంగా పెట్టుకున్న బంగారు స్వప్నం సాకారం కాకపోవచ్చు గానీ ఇప్పుడు మోగించిన కంచు విలువ కూడా అమూల్యం. ఒక్క ఒలింపిక్‌ పతకం కోసం కోటి కళ్లతో నిరీక్షించే సగటు భారత అభిమానుల కోణంలో చూస్తే వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించడమంటే అసాధారణం. 

రెండు ఒలింపిక్స్‌ పతకాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... ఆసియా క్రీడల్లో రజత, కాంస్యాలు... కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ, రజత, కాంస్యాలు... వీటికి తోడు బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో లెక్కకు మించి విజయాలు, సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌... సమకాలీన భారత క్రీడా రంగంలో ఏ క్రీడాంశంలోనైనా వ్యక్తిగతంగా ఇన్ని ఘనతలున్న ప్లేయర్‌ మరొకరు లేరు. షటిల్‌తో సహవాసంలో సింధు ఆట ఇన్నేళ్లలో ఆకాశపు అంచులను తాకింది. ఎవరూ అందుకోలేని విజయాలతో తారాజువ్వలా దూసుకుపోయిన సింధు భారత క్రీడల్లో ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ స్థానాన్ని అందుకుంది. ఒక్క ఒలింపిక్‌ విజయంతో మురిసిపోకుండా ఐదేళ్లుగా మళ్లీ అంతే స్థాయిలో శ్రమించి రెండో పతకాన్ని సింధు అందుకున్న తీరు అసమానం. అనూహ్యంగా ఓడిపోయి కనకపు కల చెదిరిన తర్వాత కూడా భావోద్వేగాలను పక్కన పెట్టి తర్వాతి మ్యాచ్‌లో చెలరేగిన తీరు సింధులోని అసలైన చాంపియన్‌ ప్లేయర్‌ను చూపించింది. ఒలింపిక్‌ పతకాల రంగుల్లో ఇప్పుడు మూడోది మాత్రమే మిగిలింది. మూడేళ్ల లోపే పారిస్‌ ఒలింపిక్స్‌ పిలుస్తోంది...కమాన్‌ సింధు!!!

టోక్యో: ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో ఎదురైన ఓటమి బాధను అధిగమించి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తనదైన స్థాయిలో సత్తా చాటింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అద్భుత ఆటను ప్రదర్శించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సింధు 21–13, 21–15 స్కోరుతో హి బింగ్‌జియావో (చైనా)పై ఘన విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండో ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో పతకం చేరింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న సింధు, ఇప్పుడు కంచు పతకం అందుకొని ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా ఘనత సృష్టించింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ సాధించిన కాంస్యం నుంచి చూస్తే వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్‌కు పతకం రావడం విశేషం. పీవీ సింధుకంటే ముందు రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు (2008లో కాంస్యం; 2012లో రజతం) సాధించిన భారత ప్లేయర్‌గా ఘనత వహించాడు.  

ఏకపక్షంగా... 
ముఖాముఖి రికార్డు చూసుకుంటే ఈ మ్యాచ్‌కు ముందు బింగ్‌జియావోపై ఆరుసార్లు గెలిచిన సింధు, తొమ్మిదిసార్లు ఓడింది. దీన్ని చూస్తే కాంస్య పతక పోరు హోరాహోరీగా సాగవచ్చని అనిపించింది. అయితే 53 నిమిషాల ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. గత మ్యాచ్‌ పరాజయపు కసినంతా ఇక్కడ చూపిస్తూ తనదైన శైలిలో చెలరేగింది. సెమీస్‌లో 79 నిమిషాల సుదీర్ఘ పోరుతో అలసిపోయినట్లు కనిపించిన బింగ్‌జియావో కోర్టులో స్వేచ్ఛగా కదలడంలో ఇబ్బంది పడింది. మరోవైపు భారత షట్లర్‌ మాత్రం పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో ఆడింది. జోరుగా మొదలు పెట్టిన సింధు తొలి గేమ్‌లో 4–0తో ఆధిక్యం ప్రదర్శించింది. అయితే వరుస పాయింట్లతో జియావో 5–5తో సమం చేసింది. ఈ దశలో తన స్మాష్‌లతో విరుచుకుపడిన భారత షట్లర్‌ 11–8తో మళ్లీ ముందంజ వేసింది.

విరామం తర్వాత వరుసగా మూడు పాయింట్లతో దూసుకుపోయిన సింధు చివరి వరకు దూకుడు ప్రదర్శించి తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. మరోసారి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు డైరెక్ట్‌ స్మాష్‌ల వేగాన్ని ప్రత్యర్థి అడ్డుకోలేకపోయింది.  బ్రేక్‌ సమయానికి సరిగ్గా 11–8 వద్దే సింధు నిలిచింది. ఆ తర్వాత బింగ్‌జియావో కొన్ని డ్రాప్‌ షాట్‌లతో పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. తన ఆధిక్యాన్ని కొనసాగించిన భారత ప్లేయర్‌ ట్రేడ్‌ మార్క్‌ స్మాష్‌ షాట్‌తో మ్యాచ్‌ను ముగించింది. మరో ఒలింపిక్‌ పతకాన్ని సాధించి కోర్టు దద్దరిల్లేలా విజయనాదం చేసింది. ఫైనల్లో చెన్‌ యుఫె (చైనా) 21–18, 19–21, 21–18తో వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఓడిన తై జు యింగ్‌కు రజత పతకం లభించింది.  

ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత వచ్చిన ఈ ఫలితం చాలా సంతోషం కలిగిస్తోంది. కాంస్యం గెలిచినందుకు ఆనందించాలా, ఫైనల్‌ చేరలేకపోయినందుకు బాధ పడాలా అని కొద్దిసేపు నా మనసులో ఎన్నో భావోద్వేగాలు చెలరేగాయి. మూడో స్థానం మ్యాచ్‌లో అన్నిఆలోచనలను పక్కన పెట్టి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు బరిలోకి దిగా. దేశం కోసం పతకం గెలవడం గర్వంగా ఉంది. ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్నా. నా కుటుంబం, కోచ్‌లు నా కోసం ఎంతో కష్టపడ్డారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు కూడా నేను సిద్ధం.  –పీవీ సింధు

మరిన్ని వార్తలు