FIFA WC 2022: ఆరో టైటిల్‌ వేటలో బ్రెజిల్‌

18 Nov, 2022 07:21 IST|Sakshi

ఫుట్‌బాల్‌ అనగానే వినిపించే దేశం పేరు బ్రెజిల్‌... ప్రపంచవ్యాప్తంగా తమ జాతీయ జట్టుతో సంబంధం లేకుండా బ్రెజిల్‌ను అభిమానించేవారే పెద్ద సంఖ్యలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఆటకు పర్యాయపదంగా నిలిచిన బ్రెజిల్‌ ఐదు సార్లు విశ్వవిజేతగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పీలే కాలంనుంచి రొనాల్డో వరకు ఎందరో బ్రెజిల్‌ స్టార్లు ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేశారు. 2002లో చివరి సారి చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆ జట్టు తర్వాతి నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. గ్రూప్‌ ‘జి’లో ఇతర జట్ల అవకాశాలను చూస్తే...  –సాక్షి క్రీడా విభాగం

బ్రెజిల్‌ 
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ఐదు సార్లు చాంపియన్‌ (1958, 1962, 1970, 1994, 2002)  
‘ఫిఫా’ ర్యాంక్‌: 1 అర్హత ఎలా: క్వాలిఫయింగ్‌ దశలో ఆడిన 17 మ్యాచ్‌లలో 11 విజయాలతో అర్హత సాధించింది. 3 మ్యాచ్‌లలో ఓడగా, మరో 3 డ్రా అయ్యాయి.  
వరుసగా గత నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌ టాప్‌–3 లో నిలవడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు కోచ్‌ టిటె జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. కొత్తతరం అటాకింగ్‌ ఆటగాళ్లతో అతను జట్టును నింపడం సత్ఫలితాలు ఇచ్చింది. స్టార్‌ ప్లేయర్‌ నెమార్‌ జట్టును ముందుండి నడిపించగలడు. అలీసాన్‌ ప్రస్తుతం అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకడు. థియాగో, రఫిన్హా ఇతర కీలక ఆటగాళ్లు. గ్రూప్‌ టాపర్‌ ఖాయం. 

సెర్బియా 
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (1930, 1962)  ‘ఫిఫా’ ర్యాంక్‌: 21 అర్హత ఎలా: క్వాలిఫయింగ్‌ టోర్నీలో పోర్చుగల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంతో అర్హత సాధించడం విశేషం.  అటాకింగ్‌ ప్రధాన బలం కాగా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. కోచ్‌ స్టొకోవిచ్‌ జట్టులో కొత్త స్ఫూర్తిని నింపాడు. దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన  కెప్టెన్‌ డ్యుసాన్‌ టాడిక్‌ ప్రదర్శనే కీలకం కానుంది. పావ్లొవిక్, ల్యూకిక్‌ ఇతర ప్రధాన ఆటగాళ్లు.  అయితే గ్రూప్‌లో పోటీని బట్టి చూస్తే నాకౌట్‌ చేరడం అద్భుతమే అవుతుంది.  

స్విట్జర్లాండ్‌ 
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు క్వార్టర్‌ ఫైనల్‌ (1934, 1938, 1954) ‘ఫిఫా’ ర్యాంక్‌: 15 అర్హత ఎలా: క్వాలిఫయింగ్‌ టోర్నీలో తమ గ్రూప్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోలేదు. 15 గోల్స్‌ చేసి 2 మాత్రమే ఇచ్చి అనూహ్యంగా అగ్రస్థానంలో నిలిచింది. కొత్త కోచ్‌ మురాత్‌ యకీన్‌ పర్యవేక్షణలో డిఫెన్స్‌లో బలంగా మారింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టితత్వంతో మ్యాచ్‌లు నెగ్గడమే స్విస్‌ జట్టు ప్రధాన బలం. బ్రెజిల్‌ను వదిలేస్తే రెండో స్థానం కోసం సెర్బియాతో పోటీ ఉంటుంది కాబట్టి ఆ మ్యాచ్‌తోనే ముందంజ వేయడం తేలుతుంది.  

కామెరూన్‌ 
ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్‌ ఫైనల్‌ (1990)  ‘ఫిఫా’ ర్యాంక్‌: 43 అర్హత ఎలా: క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఒక దశలో నిష్క్రమించేలా కనిపించినా...ప్లే ఆఫ్స్‌లో అల్జీరియాపై చేసిన ఏకైక గోల్‌తో గట్టెక్కి అర్హత సాధించింది. అంతర్జాతీయ పోటీల్లో కామెరూన్‌ చరిత్రను చూస్తే ఎన్నో పెద్ద జట్లను ఓడించిన సంచలన విజయాలు కనిపిస్తాయి. ఆఫ్రికా నేషన్స్‌ టోర్నీలో గోల్డెన్‌ బూట్‌ గెలిచిన అబూబకర్‌ ప్రమాదకరమైన ఆటగాడు.  అయితే స్టార్లు లేని ఈ జట్టు సహజంగానే ఒత్తిడికి చిత్తయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే దీనిని అధిగమిస్తే మరో సంచలనాన్ని ఆశించవచ్చు.
చదవండి: FIFA WC 2022: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే   

మరిన్ని వార్తలు