Qatar 2022 FIFA World Cup: మరో ప్రపంచకప్‌ వచ్చేసింది!

8 Nov, 2022 04:10 IST|Sakshi

నవంబర్‌ 20 నుంచి ఫుట్‌బాల్‌ విశ్వ సమరం

బరిలో 32 జట్లు

డిసెంబర్‌ 18న ఫైనల్‌   

ప్రపంచపటంలో దిగువన పసిఫిక్‌ మహా సముద్రం పక్కన ఒక విశ్వ క్రీడా వినోదం చివరి దశకు చేరుకుంది. అది ముగిసిన సరిగ్గా వారం రోజులకే పశ్చిమాసియాలో అరేబియన్‌ ద్వీపకల్పం వద్ద మరో భారీ క్రీడా సంబరానికి తెర లేవనుంది. 16 జట్ల క్రికెట్‌ పోరు ముగియగానే క్రీడాభిమానుల కోసం 32 జట్ల ఫుట్‌బాల్‌ సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో అభిమానులను ఉర్రూతలూగించే ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ మళ్లీ వచ్చేసింది. గల్ఫ్‌ దేశం ఖతర్‌ తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదికగా మారింది. నవంబర్‌ 20న ఆతిథ్య జట్టు మ్యాచ్‌తోనే మొదలయ్యే మెగా టోర్నీ పోరు 29 రోజుల పాటు గోల్స్‌ గోలతో ఊపేయనుంది. ఈ నేపథ్యంలో 22వ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు...  

తొలి మ్యాచ్‌: ఖతర్‌ VS ఈక్వెడార్‌  
ఫార్మాట్‌: 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లతో ఆడతాయి. ప్రతీ గ్రూప్‌ నుంచి రెండేసి జట్లు చొప్పున 16 టీమ్‌లు నాకౌట్‌ దశకు (ప్రిక్వార్టర్‌ ఫైనల్‌) అర్హత సాధిస్తాయి. ప్రిక్వార్టర్‌ దశలో ఎనిమిది గ్రూప్‌ల విజేతలు ఎనిమిది గ్రూప్‌ల రన్నరప్‌నే ఎదుర్కొంటాయి.   
మొత్తం మ్యాచ్‌ల సంఖ్య: 64
(గ్రూప్‌ దశలో 48; నాకౌట్‌లో 16)

► 2022 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు 2010 డిసెంబర్‌ 2వ తేదీన ఖతర్‌కు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ప్రకటించింది. 2022 ప్రపంచకప్‌ ఆతిథ్యం కోసం మొత్తం ఐదు దేశాలు (ఖతర్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా) పోటీపడ్డాయి. 22 మంది సభ్యులతో కూడిన ‘ఫిఫా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఓటింగ్‌ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసింది. ఓటింగ్‌ రౌండ్‌–1లో ఆస్ట్రేలియా... రౌండ్‌–2లో జపాన్‌..  రౌండ్‌–3లో దక్షిణ కొరియా... ఓటింగ్‌ రౌండ్‌–4లో అమెరికా నిష్క్రమించాయి.  

► 92 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో ఖతర్‌ జట్టు తొలిసారి ఆడుతోంది. గతంలో ఏనాడూ ఖతర్‌ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేదు. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్‌కు నేరుగా టోర్నీలో ఆడే అవకాశం లభించింది.  

► ప్రపంచకప్‌లో పోటీపడుతున్న 32 జట్లలో ఖతర్‌ మినహా మిగతా 31 దేశాలు గతంలో కనీసం ఒక్కసారైనా ప్రపంచకప్‌ టోర్నీలో బరిలోకి దిగాయి. 2022 ప్రపంచకప్‌ కోసం 2019 జూన్‌ 6 నుంచి 2022 జూన్‌ 14 వరకు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. 2018 ప్రపంచకప్‌లో ఐస్‌లాండ్, పనామా అరంగేట్రం చేసినా ఈసారి మాత్రం కొత్త జట్లు అర్హత పొందలేకపోయాయి.

► ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్‌ నిలిచింది. జర్మనీ (18 సార్లు) రెండో స్థానంలో, అర్జెంటీనా (13 సార్లు) మూడో స్థానంలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు