Qatar FIFA World Cup 2022: క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌

4 Dec, 2022 05:00 IST|Sakshi
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డంఫ్రైస్‌

3–1తో అమెరికాపై ఘనవిజయం

అదరగొట్టిన డంఫ్రైస్‌ ‘ఫిఫా’ ప్రపంచకప్‌

అమెరికాకు తొలి నాకౌట్‌ దెబ్బ పడింది. నెదర్లాండ్స్‌ మొదటి క్వార్టర్స్‌ బెర్తు సాధించింది. ప్రపంచకప్‌లో లీగ్‌ దశ వెనువెంటనే మొదలైన నాకౌట్‌ పోరులో మూడుసార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌ 3–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. డచ్‌ డిఫెండర్లు ప్రత్యర్థి స్ట్రయికర్లను నిలువరించగా... ఫార్వర్డ్‌ ఆటగాళ్లు గోల్స్‌ చేయడంలో సఫలమయ్యారు.

దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో నెదర్లాండ్స్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డచ్‌ టీమ్‌ 3–1 గోల్స్‌ తేడాతో అమెరికాపై జయభేరి మోగించింది. నెదర్లాండ్స్‌ ఆటగాడు డెంజెల్‌ డంఫ్రైస్‌ అసాధారణ ఆటతీరు కనబరిచాడు. డచ్‌ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలి రెండు గోల్స్‌కు మెరుపు పాస్‌లు అందించిన డెంజెల్‌... ఆట ముగింపు దశలో స్వయంగా తనే గోల్‌ చేయడంతో నెదర్లాండ్స్‌ ఆధిక్యానికి ఎదురేలేకుండా పోయింది.

డచ్‌ తరఫున మెంఫిస్‌ డిపే (10వ ని.), డెలీ బ్లైండ్‌ (ఇంజ్యూరి టైమ్‌ 45+1వ ని.), డంఫ్రైస్‌ (81వ ని.) గోల్‌ చేశారు. అమెరికా జట్టులో హజి రైట్‌ (76వ ని.) గోల్‌ సాధించాడు. ఆట ఆరంభంలో అమెరికా స్ట్రయికర్లే నెదర్లాండ్స్‌ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. రెండో నిమిషం నుంచే అమెరికా గోల్‌ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫినిషింగ్‌ లోపాలతో ఏ ఒక్కటి సఫలం కాలేదు. అయితే ఆట పదో నిమిషంలో కళ్లు చెదిరే గోల్‌కు డంఫ్రైస్‌ కారణమయ్యాడు. ప్రత్యర్థి డి ఏరియాకు సమీపంలో కుడివైపు నుంచి డంఫ్రైస్‌ దూసుకొస్తూ ఇచ్చిన క్రాస్‌పాస్‌ను మెంఫిస్‌ డిపే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే మెరుపువేగంతో గోల్‌కీపర్‌కు అవకాశం లేకుండా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు.

మళ్లీ తొలి అర్ధభాగం స్టాపేజ్‌ (ఇంజ్యూరి టైమ్‌)లో అదే రకమైన క్రాస్‌ పాస్‌ను డెలీ బ్లైండ్‌కు ఇవ్వగా అతను కూడా చాకచక్యంగా బంతిని లక్ష్యం చేర్చడంలో సఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో అమెరికా బృందంలో 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ అయిన హజి రైట్‌ (76వ ని.) వచ్చిన 9 నిమిషాలకే అమెరికాకు గోల్‌ చేసి పెట్టాడు. డచ్‌ ఆధిక్యం 2–1కు తగ్గిన కాసేపటికే డంఫ్రైస్‌ మళ్లీ గర్జించాడు. ఈసారి తానే ఏకంగా గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో 81వ నిమిషంలో నెదర్లాండ్స్‌ ఖాతాలో మూడో గోల్‌ చేరింది.  మ్యాచ్‌లో డచ్‌ను నడిపించిన డెంజెల్‌ డంఫ్రైస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. అర్జెంటీనా–ఆస్ట్రేలియా మ్యాచ్‌ విజేతతో నెదర్లాండ్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తలపడుతుంది.  

ప్రపంచకప్‌లో నేడు (ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌)
ఫ్రాన్స్‌ X పోలాండ్‌  రాత్రి గం. 8:30 నుంచి  
ఇంగ్లండ్‌ X సెనెగల్‌ అర్ధరాత్రి గం. 12:30 నుంచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డంఫ్రైస్‌

మరిన్ని వార్తలు