Queen Elizabeth II: క్రికెటర్‌ చెంపపై ఆటోగ్రాఫ్‌ నిరాకరించిన క్వీన్‌ ఎలిజబెత్‌-2

9 Sep, 2022 12:00 IST|Sakshi

బ్రిటన్‌ను 70 ఏళ్లకు పైగా పాలించి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన రాణి ఎలిజబెత్‌–2  96 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి  తెలిసిందే. వేసవి విరామం కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో ఉన్న రాణి గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ధ్రువీకరించింది. 1952లో 25 ఏళ్లకే బ్రిటన్‌ రాణి కిరీటం ధరించిన ఎలిజబెత్‌ అత్యధిక కాలం రాణిగా కొనసాగారు.

ఇదిలాఉంటే 70 ఏళ్ల పాలనలో ఎన్నో చూసిన క్వీన్‌ ఎలిజబెత్‌కు క్రీడలతోనూ మంచి అనుబంధం ఉంది. ఆటలకు అతీతంగా ఆమె క్రీడాకారులను ప్రోత్సహించేది. ఇక క్రికెట్‌తోనూ బంధం ముడిపడి ఉన్న క్వీన్‌ ఎలిజబెత్‌.. ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చిన ప్రతీ జట్టును తన నివాసమైన బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌కు పిలిపించుకునేది. వారితో ఫోటో సెషన్‌ అనంరతం అతిథి మర్యాదలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.


అయితే క్వీన్‌ ఎలిజబెత్‌-2 గురించి ఒక ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ డెన్నిస్‌ లిల్లీకి.. క్వీన్‌ ఎలిజబెత్‌-2తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1977లో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో సెంటనరీ టెస్టు మ్యాచ్‌ నిర్వహించారు. ఆ మ్యాచ్‌కు క్వీన్‌ ఎలిజబెత్‌-2 ముఖ్య అతిథిగా విచ్చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లను రాణి ఎలిజబెత్‌ పరిచయం చేసుకున్నారు.

ఈ క్రమంలో అప్పటి ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ డెన్నిస్‌ లిల్లీ తనను తాను పరిచయం చేసుకొని.. ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలంటూ అతని చెంపను చూపించాడు. అయితే ప్రోటోకాల్‌ సమస్య వల్ల క్వీన్‌ ఎలిజబెత్‌ ఆటోగ్రాఫ్‌ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తర్వాత తన రాయబారితో సంతకంతో కూడిన ఫోటోగ్రాఫ్‌ను డెన్నిస్‌ లిల్లీకి పంపించడం అప్పట్లో ఆసక్తి కలిగించింది. తాజాగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంపై స్పందించిన డెన్నిస్‌ లిల్లీ మరోసారి రాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చకున్నాడు. 

ఇక క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణంతో శుక్రవారం ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దుచేశారు. క్వీన్‌ ఎలిజబెత్‌ మరణంపై స్పందించిన ఈసీబీ.. ''రాణి ఎలిజబెత్‌-2 ఇక లేరన్న దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఆమె మృతికి నివాళి అర్పిస్తూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు తొలిరోజు ఆటను రద్దు చేస్తున్నాం. వీటితో పాటు ఇంగ్లండ్‌లో జరిగే మిగతా టోర్నీలోని మ్యాచ్‌లను కూడా రద్దు చేశాం. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కులర్‌ జారీ చేశాం'' అని తెలిపింది.

చదవండి: Queen Elizabeth II: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 ఇకలేరు

రాజరికంలో క్వీన్‌ ఎలిజబెత్‌-2 సరికొత్త రికార్డు.. ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలివే!

>
మరిన్ని వార్తలు