మళ్లీ ఆంక్షలా... మా వల్ల కాదు!

4 Jan, 2021 01:02 IST|Sakshi

బ్రిస్బేన్‌లో కరోనా నిబంధనలపై భారత క్రికెటర్ల అసహనం

అవసరమైతే నాలుగో టెస్టు నుంచి వాకౌట్‌ చేస్తామని హెచ్చరిక

అంతా సాఫీగా, ఆత్మీయంగా సాగిపోతే... ఏదో ఒక రచ్చ లేకపోతే అది భారత్‌–ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ ఎలా అవుతుంది? ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగుతున్న పర్యటనలో అనూహ్యంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. హోటల్‌లో భోజనం కారణంగా ‘ఐసోలేషన్‌’తో మొదలైన చర్చ తర్వాతి రోజు భారత జట్టు నాలుగో టెస్టును బాయ్‌కాట్‌ చేయడం వరకు చేరింది! కరోనా నేపథ్యంలో బ్రిస్బేన్‌లో మళ్లీ కఠిన ఆంక్షల మధ్య ఆడాల్సి వస్తుండటం టీమిండియా అసంతృప్తికి కారణం.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెటర్లు సుమారు రెండు నెలల పాటు బయో బబుల్‌లోనే ఐపీఎల్‌ ఆడారు. ఇక్కడికి చేరుకోగానే రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టారు. 3 వన్డేలు, 3 టి20లు, 2 టెస్టులు కూడా జరిగిపోయాయి. జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్టుకు క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. ఆపై మరో మ్యాచ్‌ ఆడితే స్వదేశం తిరిగి వెళ్లిపోవచ్చు. కానీ ఈ ఒక్క మ్యాచ్‌ కోసమే మళ్లీ కఠిన కరోనా ఆంక్షలు పాటించాల్సి వస్తే..! ఇదే ఇప్పుడు జట్టు ఆటగాళ్లను అసహనానికి గురి చేస్తోంది. అవసరమైతే చివరి టెస్టు ఆడకుండానే వెళ్లిపోతామని కూడా వారు చెబుతున్నారు.

హోటల్‌ గది... గ్రౌండ్‌... హోటల్‌...
షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నగరం ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రం కావడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మూడో టెస్టు వేదిక అయిన సిడ్నీలో కూడా కేసులు ఎక్కువగా ఉండటంతో క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రం ఇప్పటికే సిడ్నీకి వెళ్లే సరిహద్దులు మూసేసి రాకపోకలపై నిషేధం విధించింది. అయితే సిరీస్‌ ఆరంభానికి ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఇచ్చిన మాట ప్రకారం ఆటగాళ్లు తమ నగరానికి వచ్చి టెస్టు ఆడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే సిడ్నీ నుంచి వచ్చేవారి విషయంలో ఎలాంటి కరోనా ఆంక్షలు విధిస్తారో అనే విషయంపై స్పష్టత లేదు.  ఇంకా చెప్పాలంటే బ్రిస్బేన్‌లో అడుగు పెట్టాలంటే సిడ్నీ నుంచి ఆంక్షలు పాటిస్తూ రావాల్సి రావచ్చు. ఇక్కడే మన ఆటగాళ్లు భయపడుతున్నారు. అయితే మరోసారి పూర్తిగా హోటల్‌ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని వారు స్పష్టంగా చెప్పేశారు.

‘ప్రస్తుత పరిస్థితులపై మాకు అవగాహన ఉంది. ఈ పర్యటన విషయంలో సీఏ, బీసీసీఐ కలిసి బాగా పని చేశాయి. మేం కూడా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఆస్ట్రేలియా పర్యటించేందుకు సిద్ధమయ్యాం. అయితే మేం ఒకసారి ఇక్కడికి రాగానే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న తర్వాత మమ్మల్ని కూడా సాధారణ ఆ స్ట్రేలియా పౌరుల్లాగానే చూడాలి. ఐపీఎల్‌ నుంచి మేం బబుల్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మళ్లీ కొత్తగా బ్రిస్బేన్‌లో మరో బబుల్‌ అంటే మా వల్ల కాదు. అవకాశం ఉంటే చివరి టెస్టు కూడా సిడ్నీలోనే నిర్వహించాలి. లేదంటే మేం చివరి టెస్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడం’ అని భారత క్రికెట్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే చివరి టెస్టుకు మరికొంత సమయం ఉన్నందున ప్రస్తుతానికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుది నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే ధోరణిలో ఉంది.

మేం బ్రిస్బేన్‌లోనే ఆడతాం...
ఒకే వేదికపై వరుసగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధంగా లేము. సిరీస్‌ ఆరంభానికి ముందు నిర్ణయించిన షెడ్యూల్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కట్టుబడి ఉంది. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదు. మేం బ్రిస్బేన్‌లో ఆడేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. అక్కడ కఠినమైన ఆంక్షలు, బయో బబుల్‌ ఉండవచ్చు కూడా. అయితే అన్నింటినీ మేం పాటిస్తాం. హోటల్‌ నుంచి మైదానానికి మాత్రమే వెళ్లి వచ్చే అనుమతి ఉంటే తప్పేముంది. అలాగే చేద్దాం.

–మాథ్యూ వేడ్‌

భారత క్రికెటర్లు నిబంధనల ప్రకారం ఆడలేమని, క్వారంటైన్‌ కట్టుబాట్లను పాటించలేమని భావిస్తే ఇక్కడికి రావద్దు. ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి.     

–రాస్‌ బేట్స్, క్వీన్స్‌లాండ్‌ రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలు (షాడో మినిస్టర్‌)

అంతా కలిసి సిడ్నీకి...
మూడో టెస్టు కోసం భారత జట్టు మొత్తం నేడు ప్రత్యేక విమానంలో సిడ్నీకి వెళుతుంది. బయో సెక్యూరిటీ బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘ఐసోలేషన్‌’లోకి వెళ్లిన ఐదుగురు ఆటగాళ్లు  రోహిత్, పంత్, పృథ్వీ, గిల్, సైనీ కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా జట్టుతో పాటే ప్రయాణిస్తారు. హోటల్‌ ఘటనపై సీఏ విచారణ కొనసాగిస్తున్నా... సహచరులతో వెళ్లే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాకు తెలిసి ఆటగాళ్లపై ఎలాంటి చర్యా ఉండదు. ఆ అభిమాని తనను పంత్‌ హత్తుకున్నాడని అబద్ధం చెప్పి ఉండకపోతే పరిస్థితి అసలు ఇంత దూరం వచ్చేదే కాదు.

ఏదో బయట వర్షం పడుతుంటే క్రికెటర్లంతా లోపలికి వెళ్లారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా అతను వీడియో తీశాడు. పైగా ఎవరూ అడగకపోయినా బిల్లు చెల్లించి ప్రచారం కోసం సోషల్‌ మీడియాలో పెట్టాడు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సదరు ఘటన విషయంలో టీమిండియా అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ గిరీశ్‌ డోంగ్రీ వైఫల్యంపై విమర్శలు వస్తున్నాయి. తాము ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆటగాళ్లు ఒక జాబితా పట్టుకొని తిరగరు. ఇవన్నీ చూసుకోవాల్సింది మేనేజర్‌ మాత్రమే. ఈ విషయంలో అతను తప్పు చేసినట్లు అనిపిస్తోంది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు