ఆతిథ్య హక్కులు లభిస్తే... 2032 ఒలింపిక్స్‌ అక్కడే! 

21 Apr, 2021 12:50 IST|Sakshi

బ్రిస్బేన్‌: త్వరలోనే ‘గాబా’ క్రికెట్‌ స్టేడియం కొత్త హంగులతో ముస్తాబు కానుంది. 2032 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు ఆస్ట్రేలియాకు లభిస్తే... బ్రిస్బేన్‌ ఈ విశ్వ క్రీడలకు వేదికగా నిలువనుంది. దాంతో ఒక బిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లతో (దాదాపు రూ.5,850 కోట్లు) ‘గాబా’ను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు క్వీన్స్‌ల్యాండ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అంతేకాకుండా ‘గాబా’ స్టేడియం సామర్థ్యాన్ని 42 వేల నుంచి 50 వేలకు పెంచనున్నట్లు క్వీన్స్‌ల్యాండ్‌ ప్రీమియర్‌ అనస్తాసియా పలాస్‌జుక్‌ పేర్కొన్నారు.

కాగా, 2032 ఒలింపిక్స్‌ కోసం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) బిడ్‌లను ఆహ్వానించగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిస్బేన్‌ రేసులో నిలిచింది. ఈ ఏడాది జూలైలో 2032 ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశాన్ని ఐఓసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే 2032 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులను కోరుతూ దక్షిణ కొరియా కూడా బిడ్‌ వేసింది. ఇదిలా ఉండగా, గత సంవత్సరం నుంచి ఈ ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయడమో... లేక మరోసారి వాయిదా వేయడమో చేయాలంటూ మెజారిటీ శాతం మంది జపాన్‌ వాసులు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.

చదవండి: ఎవరూ లేని ఒసాకాలో... ఏకాకిగా

మరిన్ని వార్తలు