Babar Azam: ఫామ్‌లోనే లేడు.. పాఠ్య పుస్తకాల్లోకి మాత్రం ఎక్కాడు

14 Sep, 2022 08:51 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ప్రస్తుత తరంలో టాప్‌ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా బాబర్‌ ఆజం నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో కెప్టెన్‌ హోదాలో జట్టును ఫైనల్‌ చేర్చినప్పటికి..  బ్యాటింగ్‌లో ఘోర ప్రదర్శన చేశాడు. ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా నమోదు చేయని బాబర్‌ ఆజం.. ఆరు మ్యాచ్‌లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 10,9 14, 0,30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్‌ డక్‌ ఉండడం విశేషం.

అయితే ఆట ఎలా ఉన్నా బాబర్‌ ఆజం షాట్స్‌ మంచి టెక్నిక్‌తో కూడుకొని ఉంటాయి. ముఖ్యంగా బాబర్‌ ఆజం కవర్‌ డ్రైవ్‌ షాట్‌ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతని కవర్‌డ్రైవ్‌ షాట్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా తన దేశంలోని పాఠ్య పుస్తకాల్లో బాబర్‌ ఆజం పేరు దర్శనమిచ్చింది. అవునండీ.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బాబర్‌ ఆజం కవర్ డ్రైవ్‌ గురించి 9వ తరగతి ఫిజిక్స్‌ సిలబస్‌లో ఒక ప్రశ్న తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

''బాబర్ ఆజం తన బ్యాట్ ద్వారా బంతికి 150 జౌల్స్‌తో కైనటిక్‌ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్‌ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రా అయితే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది? (బి) 450గ్రా ద్రవ్యరాశి కలిగిన ఫుట్‌బాల్‌ను ఈ వేగంతో తరలించడానికి ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎంత కైనటిక్‌ ఎనర్జీ అందించాలి?" అంటూ ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ''ఫామ్‌లోనే లేడు.. అయినా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కాడు.. దీనికి అతను అర్హుడేనా'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం

మరిన్ని వార్తలు