14 ఏళ్ల తర్వాత...

17 Jan, 2021 01:45 IST|Sakshi

పాక్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు   

ఇస్లామాబాద్‌: దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై దక్షిణాఫ్రికా జట్టు మళ్లీ కాలు మోపింది. పాకిస్తాన్‌తో రెండు టెస్టులు, మూడు టి20లు ఆడేందుకు క్వింటన్‌ డికాక్‌ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు శనివారం కరాచీలో అడుగు పెట్టింది. చివరిసారిగా పాకిస్తాన్‌ వేదికగా ఈ రెండు జట్లు 2007లో టెస్టు సిరీస్‌ ఆడగా... దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్‌ నెగ్గింది. అనంతరం 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర జట్లు విముఖత చూపాయి. దాంతో కొన్ని సంవత్సరాలపాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా సిరీస్‌లను నిర్వహించింది. అక్కడ పాకిస్తాన్‌... దక్షిణాఫ్రికాతో రెండు పర్యాయాలు (2010, 2013) టెస్టు సిరీస్‌ ఆడటం విశేషం. ప్రస్తుత పర్యటనలో భాగంగా తొలి టెస్టు కరాచీ వేదికగా ఈ నెల 26–30 మధ్య... రెండో టెస్టు రావల్పిండిలో ఫిబ్రవరి 4–8 మధ్య జరగనున్నాయి. టి20 సిరీస్‌కు లాహోర్‌ ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి 11, 13, 14 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి.

మరిన్ని వార్తలు