R Praggnanandhaa: ఫైనల్లో ఓటమి.. రన్నరప్‌గా భారత టీనేజ్‌ సంచలనం

27 May, 2022 10:40 IST|Sakshi
ప్రజ్ఞానంద, డింగ్‌ లిరెన్‌(PC: Meltwater Champions Chess Tour)

చెన్నై: నిలకడైన ప్రదర్శనతో చెస్‌ఏబుల్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ చేరిన భారత టీనేజ్‌ సంచలనం రమేశ్‌బాబు ప్రజ్ఞానందకు ఫైనల్లో నిరాశే ఎదురైంది. చైనా గ్రాండ్‌ మాస్టర్‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌ డింగ్‌ లిరెన్‌ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. అయినప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థితో పాటు క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

ప్రజ్ఞానందను అభినందిస్తూ.. ‘‘నాకసలు మాటలు రావడం లేదు. అతడిని ప్రశంసించేందుకు పదాలు సరిపోవడం లేదు. ప్రాగ్‌(ప్రజ్ఞానంద) చాలా బాగా ఆడుతున్నాడు. అతడికి ఇప్పుడు కేవలం 16 ఏళ్లే. ఏ ఆటలోనైనా ఇది చాలా చిన్న వయస్సు. అతడికి ఎంతో భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల కంటే చిన్నవయసులో ఈ చెన్నై కుర్రాడు గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాడు’’ అంటూ కామెంటేటర్‌, గ్రాండ్‌మాస్టర్‌ డేవిడ్‌ హావెల్‌ కొనియాడాడు.

వెనుకబడి.. తిరిగి పుంజుకుని
కాగా ఆర్‌.ప్రజ్ఞానంద తొలి అంచెలో వెనుకబడ్డాడు. డింగ్‌ లిరెన్‌తో జరిగిన తొలి అంచె ఫైనల్లో 1.5–2.5 స్కోరుతో వెనుకబడిపోయాడు. మొదటి రౌండ్లో ఓడిన భారత కుర్రాడు... రెండో గేమ్‌ గెలిచి స్కోరును సమం చేశాడు.  అయితే, వెంటనే చైనా గ్రాండ్‌మాస్టర్‌ మూడో రౌండ్లో గెలిచి 2–1తో ఆధిక్యంలో నిలువగా... నాలుగో రౌండ్‌ డ్రాగా ముగిసింది. మరో నాలుగు గేముల రెండో అంచె ఫైనల్‌ పోరులో తిరిగి పుంజుకున్న ప్రజ్ఞానంద విజయంతో ముగించాడు. మొదటి సెట్‌లో 1.5-2.5తో గేమ్‌ను కోల్పోయిన అతడు.. రెండో సెట్‌లో 2.5-1.5తో పైచే​యి సాధించాడు. ఈ క్రమంలో టై బ్రేకర్‌ నిర్వహించగా అనువజ్ఞుడైన లిరెన్‌ విజేతగా అవతరించాడు. 

మరిన్ని వార్తలు