రబడా సరికొత్త రికార్డు  

17 Oct, 2020 21:53 IST|Sakshi

షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ పేసర్‌ కగిసో రబడా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 ఐపీఎల్‌ వికెట్లను సాధించిన బౌలర్‌గా నయా రికార్డు లిఖించాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో రబడా ఈ ఫీట్‌ను సాధించాడు. డుప్లెసిస్‌ వికెట్‌ను సాధించడం ద్వారా రబడా తన 50వ ఐపీఎల్‌ వికెట్‌ మార్కును చేరుకున్నాడు. తన 27వ ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లోనే రబడా ఈ ఘనత నమోదు చేశాడు. ఫలితంగా సునీల్‌ నరైన్‌ పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ 50 ఐపీఎల్‌ వికెట్ల మార్కును బ్రేక్‌ చేశాడు. (చెలరేగిన రాయుడు, జడేజా)

నరైన్‌ 32 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో దీన్ని సాధించగా, రబడా ఇంకా ఐదు మ్యాచ్‌లు ముందుగానే ఆ ఘనతను సాధించాడు. ఈ జాబితాలో రబడా, నరైన్‌ల తర్వాత స్థానాల్లో మలింగా(33), ఇమ్రాన్‌ తాహీర్‌(35), మెక్‌లీన్‌గన్‌(36), అమిత్‌ మిశ్రా(37)లు ఉన్నారు. కాగా, అతి తక్కువ బంతుల్లో యాభై ఐపీఎల్‌ వికెట్లను సాధించిన ఘనతను కూడా రబడా తన పేరిట లిఖించుకున్నాడు. రబడా 616 బంతుల్లో 50 ఐపీఎల్‌ వికెట్లను సాధించాడు. ఇక్కడ మలింగా తర్వాత స్థానంలో ఉన్నాడు. మలింగా 749 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించగా, నరైన్‌ 760 బంతుల్లో యాభై వికెట్ల మార్కును చేరాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 180 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంబటి రాయుడు(45 నాటౌట్‌; 25 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్స్‌లు) రవీంద్ర జడేజా(33 నాటౌట్‌; 13 బంతుల్లో 4 సిక్స్‌లు), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సీఎస్‌కే పోరాడే స్కోరును బోర్డుపై ఉంచింది. చివర్లో రాయుడు, జడేజాలు బ్యాట్‌ ఝుళిపించడంతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. వీరిద్దరూ చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు సాధించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా, రబడా, దేశ్‌పాండేలకు తలో వికెట్‌ దక్కింది. 

మరిన్ని వార్తలు