ఆటలో అలజడి

11 Jan, 2021 05:28 IST|Sakshi

సిడ్నీ టెస్టులో మరోసారి భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు

సిడ్నీ: ప్రపంచం ఓ వైపు వైరస్‌తో పోరాడుతోంది. మరోవైపు జాతి వివక్షపై చేయిచేయి కలుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియా మూకలు బరితెగించాయి. చిత్తుగా తాగిన మద్యం మత్తులో భారత క్రికెటర్లపై చెత్త వాగుడుకు దిగాయి. జాత్యాహంకార దూషణకు తెగబడి టెస్టు మ్యాచ్‌లో అలజడి రేపాయి. శనివారమే (మూడో రోజు ఆటలో) ఇది భారత ఆటగాళ్లను తాకింది. ఆదివారమైతే శ్రుతి మించింది. దీంతో టీమిండియా ఫిర్యాదు చేసింది. అంపైర్లు వెంటనే స్పందించారు. తర్వాత ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు కూడా సమస్యపై దృష్టి పెట్టాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అయితే ‘వివక్ష’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను నివేదిక కోరింది. భారత ఆటగాళ్లు దీనిపై ఉక్కుపిడికిలి బిగించాల్సిందేనన్నారు.

అసలేం జరిగింది?
బుమ్రా, సిరాజ్‌లపై శనివారం ఆసీస్‌ ఆకతాయి ప్రేక్షకులు జాత్యహంకార మాటలతో హేళన చేశారు. ఆదివారం వీరిచేష్టలు మరింత శ్రుతిమించాయి. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ సమయంలో స్క్వేర్‌ లెగ్‌ బౌండరీ వద్ద ఉన్న మూకలు అసలే తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ‘బ్రౌన్‌ డాగ్‌’, ‘బిగ్‌ మంకీ’ అంటూ దూషించారు. దీనిని గమనించిన ఆటగాళ్లంతా సిరాజ్‌ను అనునయించారు. 86వ ఓవర్‌ ముగిశాక భారత ఆటగాళ్లంతా ఓ చోట చేరుకున్నారు.

ఏం చేశారు? ఐసీసీ సీరియస్‌
క్రికెట్లో జాతి వివక్షను ఉపేక్షించబోమని ఐసీసీ తెలిపింది. సిడ్నీ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉదంతంపై సీఏ వివరణ కోరామని, నివేదిక వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది.

సీఏ క్షమాపణ
క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) జరిగిన సంఘటనపై విచారం వెలిబుచ్చింది. భారత ఆటగాళ్లను, క్రికెట్‌ బోర్డును క్షమాపణ కోరింది. ‘ఇంతటితో దీన్ని విడిచిపెట్టం. ఆకతాయిలను ఇప్పటికే గుర్తించాం. సీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వారిని మైదానాల్లోకి అనుమతించకుండా నిషేధిస్తాం. చట్టపరమైన చర్యల కోసం న్యూసౌత్‌వేల్స్‌ పోలీసులకు అప్పగిస్తాం’ అని సీఏ ఉన్నతాధికారి సీన్‌ కారల్‌ అన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా ‘మన సమాజంలో, క్రీడల్లో జాత్యహంకారానికి చోటులేదు. ఇప్పటికే సీఏతో సంప్రదించాం. దోషులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరాం’ అని ట్వీట్‌ చేశారు.

నాకు ఇది నాలుగో ఆసీస్‌ పర్యటన. గతంలో ప్రత్యేకించి సిడ్నీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేనూ బాధితుణ్నే. బౌండరీలైన్‌ వద్ద ఉండే క్రికెటర్లకు ఇలాంటి దూషణలు పరిపాటి. ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉక్కుపిడికిలి బిగించాల్సిందే.
– భారత సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌  

జాత్యహంకారాన్ని సహించేది లేదు. మైదానాల్లో ఇలాంటి రౌడీ మూకల ప్రవర్తన ఆటగాళ్లను బాధిస్తోంది. నేను 2011–12లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. దీన్ని తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి.
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

మరిన్ని వార్తలు