Rafael Nadal: 18 ఏళ్ల బంధం తెంచుకున్న నాదల్‌

17 Dec, 2022 18:38 IST|Sakshi

టెన్నిస్‌ స్టార్‌.. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌.. తన లాంగ్‌టైమ్‌ కోచ్‌ ఫ్రాన్సిస్కో రోయిగ్‌తో 18 ఏళ్ల అనుబంధం ముగిసింది. 2005లో నాదల్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన సమయంలో కోచ్‌గా ఉన్న ఫ్రాన్సిస్కో రోయిగ్‌ అప్పటినుంచి 18 ఏళ్ల పాటు అతని విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ 18 ఏళ్లలో నాదల్‌ 22 గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు కెరీర్‌లో ఎన్నో ఏటీపీ టూర్‌ టైటిల్స్‌, అవార్డులు కొల్లగొట్టాడు. తాజాగా  వ్యక్తిగత పనుల రిత్యా ఫ్రాన్సిస్కో తన టీమ్‌ నుంచి వెళ్లిపోతున్నట్లు స్వయంగా నాదల్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. 

ఈ సందర్భంగా నాదల్‌.. ఫ్రాన్సిస్కోతో ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ''ఫ్రాన్సిస్కో రోయిగ్‌ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నాడన్న విషయం మీకు చెప్పాలనుకుంటన్నా. మా బంధం విడదీయలేనిది. దాదాపు 18 సంవత్సరాల పాటు కొనసాగడం ఎంతో గొప్ప విషయం. ఆయన నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన వ్యక్తి. మేము కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు చాలా చిన్నవాడిని. నేను పిల్లాడిగా ఉన్నప్పుడే పరిచయమైన ఫ్రాన్సిస్కో రోయిగ్‌.. అంకుల్‌ టోనితో కలిసి నా కెరీర్‌ను చక్కదిద్ది ఒక సర్క్యూట్‌ను తయారు చేశారు. నా విజయాల్లో ఫ్రాన్సిస్కోది అగ్రభాగం'' అని చెప్పుకొచ్చాడు.

ఇక ఫ్రాన్సిస్కో రోయిగ్‌ వెళ్లిపోవడంతో నాదల్‌ కోచింగ్‌ టీమ్‌లో కార్లోస్‌ మోయా,  మార్క్‌ లోపెజ్‌లు 2023 సీజన్‌ వరకు కొనసాగనున్నారు. ఈ ఏడాది నాదల్‌కు కలిసొచ్చింది. కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ సాధించి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఇటీవలే ఐటీఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌ టైటిల్‌ను ఐదోసారి గెలుపొందాడు.

చదవండి: ఫిబ్రవరిలో పెళ్లిపీటలు ఎక్కనున్న టీమిండియా ఆల్‌రౌండర్‌

టీ20 వరల్డ్‌కప్‌-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం

మరిన్ని వార్తలు