French Open: ఔరా నాదల్‌

10 Jun, 2021 03:38 IST|Sakshi
నాదల్‌

14వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో స్పెయిన్‌ స్టార్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌కు షాక్‌

సంచలన విజయం సాధించిన మరియా సాకరి  

పారిస్‌: ‘మట్టి కోర్టు మహారాజుకు ఓటమి తప్పదా..!’ డియాగో ష్వార్ట్‌జ్‌మన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రెండో సెట్‌లో రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఆటతీరు చూసిన ప్రతి ఒక్కరి మదిలో మెదిలిన ఆలోచన ఇది. టోర్నీలో తన వరుస 36 సెట్‌ల విజయాలకు బ్రేక్‌ వేసిన ష్వార్జ్‌జ్‌మన్‌ దూకుడును తన సమయోచిత ఆటతో అడ్డుకున్న నాదల్‌ ఔరా అనిపించాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పాయింట్లను కోల్పోతున్న వేళ... తన ఆటతీరును మార్చుకున్న నాదల్‌ వరుస పాయింట్లతో చెలరేగి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 14వసారి సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో నాదల్‌ 6–3, 4–6, 6–4, 6–0తో ష్వార్ట్‌జ్‌మన్‌పై అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.  2 గంటలా 45 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నాదల్, ష్వార్ట్‌జ్‌మన్‌ ప్రతి పాయింట్‌ కోసం కూడా తీవ్రంగా శ్రమించారు. తొలి సెట్‌లో ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడారు. అయితే ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌... ఆ తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో ష్వార్ట్‌జ్‌మన్‌ అద్భుతంగా ఆడాడు.

తొలి మూడు గేమ్‌లను సొంతం చేసుకుని 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం నాదల్‌ పుంజుకుని వరుసగా మూడు గేమ్‌ల్లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. 5–4తో ష్వార్ట్‌జ్‌మన్‌ ఆధిక్యంలో ఉండగా సర్వీస్‌కు వచ్చిన నాదల్‌... ఒక దశలో 30–0తో ముందంజ వేశాడు. అయితే ఒక డబుల్‌ ఫాల్ట్, మూడు అనవసర తప్పిదాలు చేసి గేమ్‌తో పాటు సెట్‌ను కోల్పోయాడు. మూడో సెట్‌లో కూడా ఇరువురు ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.

రెండో సెట్‌లో తన సర్వీస్‌తో ఇబ్బంది పడ్డ నాదల్‌... మూడో సెట్‌లో దానిని సరి చేసుకున్నాడు. అంతే కాకుండా సుదీర్ఘ ర్యాలీలకు పోకుండా... మూడు, నాలుగు షాట్లలోనే పాయింట్లను సాధించేలా తన గేమ్‌ను చేంజ్‌ చేసుకున్నాడు. 9వ గేమ్‌లో ష్వార్ట్‌జ్‌మన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ ఆ తర్వాతి గేమ్‌ను గెలిచి సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. ఇక ఏకపక్షంగా సాగిన నాలుగో సెట్‌లో నాదల్‌ కసితీరా విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి పుంజుకునేందుకు ఎటుంటి అవకాశం ఇవ్వకుండా ఆరు గేమ్‌లు కూడా గెలుచుకున్నాడు. మ్యాచ్‌లో నాదల్‌ ఆరు ఏస్‌లు సంధించి మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేయగా... ష్వార్ట్‌జ్‌మన్‌ మూడు ఏస్‌లు కొట్టి మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

స్వియాటెక్‌కు చుక్కెదురు...
మహిళల సింగిల్స్‌లో బుధవారం సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో గ్రీస్‌ క్రీడాకారిణి మరియా సాకరి చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) అనూహ్యంగా ఓటమిపాలైంది. క్వార్టర్‌ఫైనల్‌ పోరులో సాకరి 6–4, 6–4తో ఎనిమిదో సీడ్‌ స్వియాటెక్‌పై అలవోక విజయం సాధించింది. మరో క్వార్టర్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ భామ బార్బొరా క్రిచికోవా 7–6 (8/6), 6–3తో అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌పై నెగ్గింది. దాంతో గతంలో ఎన్నడూ గ్రాండ్‌స్లామ్‌లో టోర్నీలో ఒక్కసారి కూడా సెమీస్‌ చేరని నలుగురు ఇప్పుడు తొలిసారి సెమీ ఫైనల్లో అడుగు పెట్టినట్లయింది. ఇప్పటికే పావ్లుచెంకోవా (రష్యా), జిదాన్‌సెక్‌ (స్లొవేనియా)లు సెమీస్‌కు అర్హత సాధించారు.

సెమీస్‌లో సిట్సిపాస్‌...
వరుసగా రెండో ఏడాది గ్రీస్‌ ఆటగాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన  క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ 6–3, 7–6 (7/3), 7–5తో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)ను ఓడించి సెమీస్‌ చేరుకున్నాడు.
 

మరిన్ని వార్తలు