Australia Open: నాదల్‌ దూకుడు.. మూడో సీడ్‌ జ్వెరెవ్‌కు షాక్‌

24 Jan, 2022 06:20 IST|Sakshi

14వ సారి క్వార్టర్‌ ఫైనల్లో స్పెయిన్‌ స్టార్‌

మూడో సీడ్‌ జ్వెరెవ్‌కు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మాజీ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 14వ సారి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ నాదల్‌ 7–6 (16/14), 6–2, 6–2తో అడ్రియన్‌ మనారినో (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 2007 నుంచి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రతిసారీ నాదల్‌ కనీసం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.

2013లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న నాదల్‌ 2016లో మాత్రం తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. మనారినోతో 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్‌కు తొలి సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 81 నిమిషాలపాటు సాగిన తొలి సెట్‌లో నాదల్‌ నాలుగుసార్లు సెట్‌ పాయింట్లను కాపాడుకున్నాడు. 28 నిమిషాల 40 సెకన్లపాటు జరిగిన టైబ్రేక్‌లో తుదకు నాదల్‌ 16–14తో పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత నాదల్‌ జోరు పెంచగా, మనారినో డీలా పడ్డాడు.   

షపోవలోవ్‌ సంచలనం
మరోవైపు టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. కెనడాకు చెందిన 14వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ 2 గంటల 21 నిమిషాల్లో 6–3, 7–6 (7/5), 6–3తో జ్వెరెవ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఐదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతున్న షపోవలోవ్‌ తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ సంపాదించాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ) 7–5, 7–6 (7/4), 6–4తో 19వ సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌)పై, 17వ సీడ్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 7–5, 7–6 (7/4), 6–3తో కెచ్‌మనోవిచ్‌ (సెర్బియా)పై గెలిచారు.  

మరిన్ని వార్తలు