నాదల్‌ నమోనమః

12 Oct, 2020 06:06 IST|Sakshi
రాఫెల్‌నాదల్‌, జొకోవిచ్

13వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ హస్తగతం

20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఫెడరర్‌ రికార్డు సమం

ఫైనల్లో జొకోవిచ్‌పై అలవోక విజయం

రూ. 13 కోట్ల 82 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

ఈసారీ ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. ఎర్రమట్టి కోర్టులపై మకుటం లేని మహరాజు తానేనని మరోమారు స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ గుర్తు చేశాడు. 13వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్‌ సీడ్, నంబర్‌వన్‌ జొకోవిచ్‌ను చిత్తుగా ఓడించిన నాదల్‌ కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ సమం చేశాడు.   

పారిస్‌: సాధారణంగా ప్రతి యేటా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మే–జూన్‌ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లో నిర్వహించాల్సి వచ్చింది. తేదీలు మారినా పురుషుల సింగిల్స్‌ విభాగంలో మాత్రం విజేత మారలేదు. ఫైనల్లో తన అజేయ రికార్డును కొనసాగిస్తూ స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ 13వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 2 గంటల 41 నిమిషాల్లో 6–0, 6–2, 7–5తో జొకోవిచ్‌ను ఓడించాడు. టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా నాదల్‌ టైటిల్‌ నెగ్గడం ఇది నాలుగోసారి. విజేతగా నిలిచిన నాదల్‌కు 16 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌ జొకోవిచ్‌కు 8,50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

► ఈ ఏడాది పూర్తిగా ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్కసారీ ఓటమి చవిచూడని (యూఎస్‌ ఓపెన్‌లో తన తప్పిదంతో మ్యాచ్‌ను వదులుకున్నాడు) జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. తొలి సెట్‌లో ఒక్కసారీ తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. జొకోవిచ్‌ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌నూ మూడుసార్లు నిలబెట్టుకొని నాదల్‌ 48 నిమిషాల్లో తొలి సెట్‌ను 6–0తో సొంతం చేసుకున్నాడు.  

► రెండో సెట్‌లోనూ పరిస్థితి మారలేదు. నాదల్‌ తన జోరు పెంచగా... జొకోవిచ్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు. అతికష్టమ్మీద రెండు గేమ్‌లు గెల్చుకున్న సెర్బియా స్టార్‌ 51 నిమిషాల్లో రెండో సెట్‌నున కోల్పోయాడు.  

► మూడో సెట్‌లో జొకోవిచ్‌ తేరుకున్నాడు. తొలి రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్నాడు. కానీ ఐదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ 3–2తో ముందంజ వేశాడు. కానీ వెంటనే నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ వరుసగా రెండు గేముల్లో తమ సర్వీస్‌లను కాపాడుకున్నాడు. పదకొండో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 12వ గేమ్‌లో తన సర్వీస్‌లో ఏస్‌ సంధించి గేమ్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో నాదల్‌ సాధించిన విజయాలు. ఫెడరర్‌ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో 100 విజయాలు నమోదు చేసిన రెండో ప్లేయర్‌ నాదల్‌. ఫెడరర్‌ రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) వంద కంటే ఎక్కువ విజయాలు సాధించాడు.

తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో నాదల్‌ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య:  999

ఈ ఏడాది చాలా కఠినంగా ఉంది. 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఫెడరర్‌ రికార్డును సమం చేసినా... అది ఒక అంకె మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నాకెప్పటికీ ప్రత్యేకమే. నా కెరీర్‌లో గొప్ప క్షణాలన్నీ ఇక్కడే వచ్చాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌తో, పారిస్‌ నగరంతో నా ప్రేమానుబంధం చిరస్మరణీయమైనది.
–రాఫెల్‌ నాదల్‌  

మరిన్ని వార్తలు