#Rafael Nadal: తిరగబెట్టిన గాయం.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న స్పెయిన్‌ బుల్‌

18 May, 2023 20:13 IST|Sakshi

స్పెయిన్‌ బుల్‌.. టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ గాయం కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌కు దూరమయ్యాడు. దీనికి తుంటి ఎముక గాయం తిరగబెట్టడమే కారణమని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తుంటి గాయంతో టోర్నీ మధ్యలోనే నాదల్‌ వైదొలిగాడు. అప్పటినుంచి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడంతో గురువారం తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడడం లేదని నాదల్‌ స్వయంగా స్పష్టం చేశాడు.

కాగా 2004 నుంచి వరుసగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడుతూ వస్తున్న నాదల్‌ తనకు అచ్చొచ్చిన గ్రాండ్‌స్లామ్‌కు దూరమవ్వడం ఇదే తొలిసారి. క్లేకోర్టు రారాజుగా అభివర్ణించిన నాదల్‌ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ కొల్లగొడితే.. అందులో 14 టైటిల్స్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లే కావడం విశేషం. అంతేకాదు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 115 మ్యాచ్‌లు ఆడిన నాదల్‌ 112 మ్యాచ్‌లు గెలిచి కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు. దీన్నిబట్టే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ ఆధిపత్యం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 

ఇక 2024 ఏడాదిలో నాదల్‌ టెన్నిస్‌ కెరీర్‌కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నట్లు AFP ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్స్‌ కొల్లగొట్టిన నాదల్‌.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విషయంలో జొకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు