-

Rafel Nadal: అప్పుడు జొకోవిచ్‌తో.. ఇప్పుడు మెద్వెదెవ్‌తో

30 Jan, 2022 20:40 IST|Sakshi

స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అదరగొట్టాడు. మెద్వెదెవ్‌పై సంచలన విజయంతో కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్లో మారథాన్‌ మ్యాచ్‌ ఆడడం ఇది రెండోసారి. ఇంతకముందు 2012లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో మారథాన్‌ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో నాదల్‌ ఓటమి పాలయ్యాడు. కానీ తాజాగా జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో మాత్రం నాదల్‌ విజృంభించాడు. వయసు మీద పడుతున్నప్పటికి తనలో సత్తువ తగ్గలేదని మరోసారి తన పదునైన ఆటతో రుచి చూపించాడు.

ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌తో జరిగిన మారథాన్‌ ఫైనల్లో 2-6, 6-7(5-7), 6-4, 6-4, 7-5తో నాదల్‌ విజయం సాధించాడు. దాదాపు 5 గంటల 30 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ ఆఖరి వరకు నువ్వా-నేనా అన్నట్లుగానే సాగింది. తొలి సెట్‌ను 2-6తో కోల్పోవడం.. రెండో సెట్‌ టై బ్రేక్‌కు దారి తీసింది. కాగా టై బ్రేక్‌ను మెద్వెదెవ్‌ గెలుచుకోవడంతో పాటు సెట్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో నాదల్‌ ఓటమి ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ నాదల్‌ తన అసలు ఆటను మూడో సెట్‌ నుంచే చూపించాడు. తన పవర్‌ గేమ్‌ను రుచి చూపిస్తూ నాదల్‌ 6-4తో మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు.

ఇక నాలుగో సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరి నడిచినప్పటికి నాదల్‌ మరోసారి విజృంభించి 6-4తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో 2-2తో సమానంగా నిలవడంతో ఐదో సెట్‌ కీలకంగా మారింది. అయితే ఐదో సెట్‌ ఉత్కంఠంగా సాగినప్పటికి చివర్లో నాదల్‌ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 7-5తో సెట్‌ను కైవసం చేసుకొని 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న సహచర ఆటగాళ్లు ఫెదరర్‌, జకోవిచ్‌లను అధిగమించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీ బరిలోకి దిగిన నాదల్‌.. ఒక్కో మెట్టును అధిగమిస్తూ 2010 తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.

సరిగ్గా 10 ఏళ్ల క్రితం జొకోవిచ్‌తో.. 

2012 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ నాదల్‌, జొకోవిచ్‌ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దాదాపు 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో జొకోవిచ్‌ చివరికి పై చేయి సాధించాడు. ఆ మ్యాచ్‌లో నాదల్‌ను జొకోవిచ్‌ 5-7, 6-4, 6-2,6-7(5-7),7-5తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. వాస్తవానికి అప్పటి మ్యాచ్‌లో నాదల్‌ తొలిసెట్‌ను గెలుచుకొని ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్‌లో ఫుంజుకున్న జొకోవిచ్‌ 6-4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడోసెట్‌ను కూడా 6-2తో గెలిచి సత్తా చాటాడు. ఇంక ఒక్కసెట్‌ గెలిస్తే నాదల్‌ ఓటమి పాలవడం అనుకున్న తరుణంలో మ్యాచ్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో నాదల్‌ అద్బుత పోరాటంతో సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన ఐదో సెట్‌లో జొకోవిచ్‌ పూర్తి ఆధిపత్యం చూపించి 7-5తో నాదల్‌ను ఓడించాడు. 

మరిన్ని వార్తలు