Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్‌.. కన్నీటిపర్యంతం

28 Jan, 2022 15:40 IST|Sakshi

స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా శుక్రవారం తొలి పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఇటలీకి చెందిన ఏడో సీడ్‌ మెట్టో బెర్రెట్టినిపై నాదల్‌ 6-3, 6-2, 3-6, 6-3తో గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఇక మెద్వదేవ్‌, సిట్సిపాస్‌ మధ్య విజేతతో నాదల్‌ ఫైనల్లో తలపడనున్నాడు. ఇప్పటివరకు నాదల్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో జొకోవిచ్‌, రోజర్‌ ఫెదరర్‌లతో సమానంగా ఉన్నాడు.

చదవండి: ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే..

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గితే.. 21 టైటిళ్లతో నాదల్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ఇక నాదల్‌ ఒక మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడడం ఇది 29వ సారి. తన కెరీర్‌లో 2009లో మాత్రమే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన నాదల్‌.. తర్వాత మరో ఆరుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికి నిరాశే ఎదురైంది. ఒకవేళ​ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కైవసం చేసుకుంటే అన్ని మేజర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు రెండుసార్లు గెలిచిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు. ఇంతకముందు జొకోవిచ్‌ మాత్రమే ఈ రికార్డును అందుకున్నాడు.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం నాదల్‌ కోర్టులోనే కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ''మ్యాచ్‌లో నాకు మంచి ఆరంభం దక్కింది. తొలి రెండు సెట్లు సొంతం చేసుకున్న నాకు మూడో సెట్‌లో బెర్రెట్టి గట్టిపోటీ ఇ‍చ్చి సెట్‌ను గెలుచుకున్నాడు. నిజానికి బెర్రెట్టి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఒక దశలో నాకు మంచి పోటీనిస్తూ మ్యాచ్‌ను నా నుంచి తీసుకునే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫైనల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో పోరాడాను.. అనుకున్నది సాధించాను. నిజాయితీగా చెప్పాలంటే ఈసారి ఫైనల్‌కు చేరడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.'' అంటూ తెలిపాడు.

మరిన్ని వార్తలు