‘ఓపెనర్‌గా దిగితే డబుల్‌ సెంచరీ కూడా చేస్తాడు’

26 Nov, 2020 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆస్ట్రేలియాతో రేపట్నుంచి ఆరంభం కానున్న వన్డే  సిరీస్‌కు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ లేకపోవడం పెద్ద లోటని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్‌ జట్టు పటిష్టంగా ఉన్నప్పటికీ  రోహిత్‌ శర్మ సేవలు అందుబాటులో లేకపోవడం ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్నాడు. తన యూట్యూబ్‌ చానెల్‌లో రోహిత్‌ శర్మ గైర్హాజరీ అంశంతో పాటు టీమిండియా ఓపెనింగ్‌, జట్టు ఎలా ఉండబోతుందనే విషయాలపై ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్‌ రికార్డు)

‘ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది రోహిత్‌ లేకపోడమే. దాంతో భారత  వన్డే, టీ20 జట్టు తరఫున శిఖర్‌ ధావన్‌కు తోడుగా ఎవరు ఓపెనింగ్‌కు దిగుతారనేది చాలా  క్లిష్టమైన ప్రశ్న. మనం మయాంక్‌  అగర్వాల్‌ను ధావన్‌కు తోడుగా ఓపెనర్‌గా చూస్తామా అనేది ఒకటైతే, సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉంది.  నా వరకూ అయితే ధావన్‌కు జతగా రాహుల్‌ ఓపెనర్‌గా దిగితేనే  బాగుంటుంది. రాహుల్‌ ఒక మంచి  ఓపెనర్‌. అతను ఓపెనర్‌గా  దిగి శతకాలు చేస్తున్నాడు. రాహుల్‌  ఓపెనర్‌గా దిగి ఆటపై ఇంకా బాగా దృష్టిపెడితే అతను డబుల్‌ సెంచరీ కూడా చేయగలడు’ అని చోప్రా తెలిపాడు.

ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు తాను అనుకునే టీమిండియా జట్టును కూడా చోప్రా ప్రకటించాడు. కోహ్లి, ధావన్‌, రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలతో పాటు నాలుగు స్పెషలిస్టు బౌలర్లు చహల్‌, బుమ్రా, షమీ,  నటరాజన్‌లు తుది జట్టులో ఆడే అవకాశం ఉందన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో  భాగంగా సిడ్నీవేదికగా  శుక్రవారం తొలి వన్డే జరుగునుంది. భారతకాలమాన  ప్రకారం ఉదయం గం.9.10ని.లకు ఆరంభం కానుంది. (అలా ప్రవర్తిస్తే సహించేది లేదు: ఆసీస్‌ కోచ్‌)

మరిన్ని వార్తలు