టీమిండియా కోచ్‌గా ద్రవిడ్, కెప్టెన్‌గా ధవన్‌..?

20 May, 2021 16:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా ఎంపికైనట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. జూలైలో శ్రీలంకలో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం బీసీసీఐ ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా పనిచేయడం ఇది తొలిసారేమీ కాదు. 2014 ఇంగ్లండ్‌ పర్యటనలో అతను భారత బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న లండన్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో తొలుత(జూన్‌ 18-22) న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనున్న భారత్.. అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్ సిరీస్ మధ్య వచ్చే గ్యాప్‌లో బీసీసీఐ ఓ పరిమిత ఓవర్ల సిరీస్‌ను ప్లాన్ చేసింది. అక్టోబర్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. ఇందుకోసం వైట్‌ బాల్‌ స్పెషలిస్ట్‌లతో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ క్రికెటర్లతో కూడిన భారత బి జట్టును ఎంపిక చేయాలని నిర్ణయించింది. 

ఈ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలతో పాటు వీలైనన్ని టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ వెలువడాల్సి ఉంది. లంకలో పర్యటించనున్న భారత బి జట్టుకు శిఖర్ ధవన్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. జట్టు సభ్యులుగా పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు ఉండే అవకాశం ఉంది.
చదవండి: టీమిండియా ఆటగాడికి ధన్యవాదాలు తెలిపిన సోనూ సూద్‌..

మరిన్ని వార్తలు