Test Cricket Debut: ఒకే రోజు టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ముగ్గురు దిగ్గజాలు

20 Jun, 2022 16:07 IST|Sakshi

భారత క్రికెట్‌ చరిత్రలో జూన్‌ 20వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తేదీ భారత క్రికెట్‌కు ముగ్గురు దిగ్గజాలను అందించిన చిరస్మరణీయమైన రోజు. వివరాల్లోకి వెళితే.. భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన ముగ్గురు క్రికెటర్లు ఇదే తారీఖున టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఒకరేమో తనదైన కెప్టెన్సీ మార్కుతో, దూకుడైన ఆటతీరుతో భారత క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పలుకగా.. మరొకరు తనకు మాత్రమే సాధ్యమైన దుర్భేద్యమైన డిఫెన్స్‌ టెక్నిక్‌తో, భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుగా నిలిచి టెస్ట్‌ క్రికెట్‌కు పునరుజ్జీవనం అందించారు.

ఇక మూడవ వ్యక్తేమో పై ఇద్దరి టాలెంట్లను కలబోసుకుని ఆధునిక క్రికెట్‌కు మార్గనిర్ధేశకుడిగా నిలిచాడు. భారత క్రికెట్‌ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కాగా.. రెండో వ్యక్తి ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, మూడో వ్యక్తి టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి‌.

వీరిలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లు 1996, జూన్ 20వ తేదీన (లార్డ్స్‌ టెస్ట్‌) టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేయగా.. ఈ ఇద్దరి ఆరంగ్రేటం తర్వాత సరిగ్గా 15 ఏళ్లకు 2011, జూన్‌ 20వ తేదీన (వెస్టిండీస్‌ పర్యటనలో కింగ్‌స్టన్‌ టెస్ట్‌) విరాట్‌ కోహ్లి టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ దిగ్గజ బ్యాటింగ్‌ త్రయంలో గంగూలీ తన తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం (131) బాది కెరీర్‌కు బలమైన పునాది వేసుకోగా, ద్రవిడ్‌ కూడా తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లి తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో(4, 15) విఫలమైనప్పటికీ ఆతర్వాత క్రమంగా పుంజుకని భారత క్రికెట్‌ మూలస్తంభాల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఇలా ఒకే తేదీన టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ముగ్గురు వ్యక్తిగతంగానే కాకుండా టీమిండియా కెప్టెన్లుగా అద్భుతంగా రాణించారు. గంగూలీ 113 టెస్టుల్లో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7212 పరుగులు.. 311 వన్డేల్లో 22 సెంచరీలు, 72 హాఫ్‌ సెంచరీలతో 11,363 పరుగులు చేయగా, ద్రవిడ్ 164 టెస్టుల్లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలతో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 12 శతకాలు, 83 అర్ధశతకాలతో 10,889 పరుగులు చేశారు.

వీరిద్దరి కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కోహ్లి 101 టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో 8043 పరుగులు, 260 వన్డేల్లో 43 సెంచరీలు, 64 అర్ధసెంచరీలతో 12311 పరుగులు సాధించాడు.

వీరిలో విరాట్ కోహ్లి టీమిండియాకి 40 టెస్టు విజయాలు అందించి అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో టాప్ 4లో నిలిచాడు. గ్రేమ్ స్మిత్ 53, రికీ పాంటింగ్ 48, స్టీవ్ వా 41 టెస్టు విజయాలతో విరాట్ కోహ్లి కంటే ముందున్నారు. 
చదవండి: T20 WC 2022: పంత్‌ వైఫల్యం.. డీకే జోరు.. ద్రవిడ్‌ ఏమన్నాడంటే!


 

మరిన్ని వార్తలు