పంజాబ్‌ ఓటమిపై రాహుల్‌ అసహనం

10 Oct, 2020 22:18 IST|Sakshi

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడిపోవడంపై కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అసహనం వ్యక్తం చేశాడు. కింగ్స్‌ పంజాబ్‌ రెండు పరుగుల తేడాతో ఓడిపోవడం రాహుల్‌ను కలిచి వేసింది. ఓపెనింగ్‌ భాగస్వామ్యం వంద పరుగులకు పైగా ఉన్నప్పటికీ మ్యాచ్‌ను చేజార్చుకోవడంపై రాహుల్‌ మాట్లాడుతూ.. ‘ ఈ ఓటమికి నా వద్ద సమాధానం లేదు. మేము బౌలింగ్‌ బాగా చేసి కేకేఆర్‌ను కట్టడి చేశాం. బౌలర్లు పరిస్థితిని బట్టి బౌలింగ్‌ చేశారు. డెత్‌ ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేశాం. మేము చేజ్‌ చేసే క్రమంలో ఎక్కడ కూడా సంతృప్తి చెందామని అనుకోవడం లేదు.  (వాటే మ్యాచ్‌.. కేకేఆర్‌ విన్నర్‌)

కేవలం గేమ్‌ గెలిచినప్పుడు మాత్రమే సంతృప్తి చెందాలి. మేము వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడ్డాం. లైన్‌ను అధిగమించే ప్రయత్నం చేయలేదు. స్టైక్‌రేట్‌ చాలా ఎక్కువగా ఉందని అనుకుంటున్నాను.  నా వరకూ చూస్తే నేను ఒక్కడ్నే మ్యాచ్‌లను ఎలా గెలిపించగలను. ఒక సారథిగా బాధ్యత తీసుకునే ఆడుతున్నా’ అంటూ రాహుల్‌ పేర్కొన్నాడు. జట్టు బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే పరాజయాలు వస్తున్నాయని రాహుల్‌ మాటల ద్వారా తెలుస్తోంది. ఇకనైనా బ్యాటింగ్‌ కుదుటపడాలని ఆశిస్తున్నాడు. వచ్చే ఏడు మ్యాచ్‌లు తమకు ఎంతో కీలకమని, ఆ మ్యాచ్‌ల్లో కూడా తన శాయశక్తులా విజయం కోసం కృషి చేస్తానని రాహుల్‌ తెలిపాడు.  (‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు‌ ఓటమి తప్పలేదు. కేకేఆర్‌ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ ఛేదనలో కింగ్స్‌ పంజాబ్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం పాలైంది. ఈ ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో కింగ్స్‌ పంజాబ్‌ను ఓటమి వెక్కిరించింది.  నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన కింగ్స్‌ పంజాబ్‌ 162 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(74; 58 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(56; 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు