సీఎస్‌కేలో ఖేదం.. ఆర్సీబీలో మోదం

31 Aug, 2020 17:12 IST|Sakshi

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ది ఘనమైన చరిత్ర. మూడు టైటిల్స్‌ సాధించిన సీఎస్‌కే అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న జాబితాలో ముంబై ఇండియన్స్‌ తర్వాత స్థానంలో ఉంది. ఈసారి కూడా టైటిల్‌ సాధించి ముంబై సరసన నిలవాలన్న కసితో ముందుగానే ప్రాక్టీస్‌ ఆరంభించే యత్నం చేసిన సీఎస్‌కేలో ఇప్పుడు కరోనా కలవరం మొదలైంది. ముందుగా ప్రాక్టీస్‌కు దిగుదామని భావించిన సీఎస్‌కే కరోనా టెస్టులు చేయించుకోగా మొత్తం 13 మందికి పాజిటివ్‌ తేలింది. ఇందులో ముగ్గురు  ఆటగాళ్లతో పాటు మిగతా సిబ్బంది ఉన్నారు. ఫలితంగా మళ్లీ ఐసోలేషన్‌లోకి వెళ్లింది సీఎస్‌కే. ప్రాక్టీస్‌ కాస్తా ఎగిరి క్వారంటైన్‌లో పడింది.  ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎస్‌కే స్టార్‌ ఆటగాడు, వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా తిరిగి భారత్‌కు వచ్చేశాడు. (చదవండి: రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్‌ ఆగ్రహం)

తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతోనే రైనా అలక చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రైనా క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైనా ఉన్నపళంగా వచ్చేయడంపై సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెన్నై టీమ్‌లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను. కొన్ని సార్లు విజయం తలకెక్కడం సహజం’ అంటూ శ్రీని నిరాశ వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ నుంచి ఎక్కడకు దారి తీసినా ప్రస్తుతం సీఎస్‌కే మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఒకవైపు కరోనా వైరస్‌ తమను వెంటాడుతుంటే మరొకవైపు రైనా వెళ్లిపోవడం ఆ జట్టుకు ఒకేసారి రెండు ఎదురుదెబ్బలు తగిలినట్లు అయ్యింది.(చదవండి: రైనాకు సీఎస్‌కే దారులు మూసుకుపోయినట్లేనా..!)

ఇక ఆర్సీబీ ఫుల్‌జోష్‌లో ఉంది. యూఏఈకి ప్రయాణమయ్యే ఏడు రోజులు ముందు వరకు బెంగళూరులోని శిబిరంలో కోహ్లి గ్యాంగ్‌ ఏకాంతానికే పరిమితమైంది.తమకు కేటాయించిన గదులకే పరిమితం అయ్యారు. దుబాయ్‌ చేరుకున్న తర్వాత కూడా ఆర్సీబీ ఆటగాళ్లు ఆరు రోజులు హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉన్నారు. కచ్చితమైన నిబంధనల్ని పాటించారు. దుబాయ్‌లో వారికి ప్రత్యేకంగా కేటాయించిన గదుల్లో ఉన్నా ఎవరూ కూడా బయటకు అడుగుపెట్టలేదు. ఈ క‍్రమంలోనే తమ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడానికి గదుల్లోనే కసరత్తులు చేశారు. ఇక్కడ వర్చవల్‌గా సమావేశమయ్యారే తప్ప బయో  సెక్యూర్‌ పద్థతినే  అవలంభించారు. ఇలా వివిధ దశలో మూడు పరీక్షలు తర్వాత సిబ్బందితో సహా అంతా నెగిటివ్‌గా వచ్చారు. దాంతో ఆర్సీబీ సక్సెస్‌ఫుల్‌ క్వారంటైన్‌ను పూర్తి చేసినట్లయ్యింది. దాంతో ప్రాక్టీస్‌కు నడుంబిగించింది. ఆర్సీబీలోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తూ కనువిందు చేశారు. ఆర‍్సీబీ కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌తో అదరగొట్టాడు. ఏబీ ఈజ్‌ బ్యాక్‌ అన్నట్లు సాగింది అతని ప్రాక్టీస్‌. ప్రస్తుతం ప్రాక్టీస్‌ సెషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఏబీ పేర్కొన్నాడు. విమానం ఎక్కేందుకు 24 గంటల ముందు రెండుసార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించడంతో పీపీఈ కిట్లు ధరించి దుబాయ్‌కు ఆర్సీబీ ఆటగాళ్లను యాజమాన్యం తీసుకొచ్చింది.  ఇక వైరస్‌ ఉనికి ఎక్కువగా ఉన్న చెన్నైలో సాధనా శిబిరం ఏర్పాటు చేయడం సీఎస్‌కేను ఇరకాటంలో పడేసింది. ప్రస్తుతం ఆర్సీబీలో మోదం.. సీఎస్‌కేలో ఖేదం అన్నట్లు ఉంది పరిస్థితి.(చదవండి: సీఎస్‌కే చేసిన పొరపాటు అదేనా?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు