Temba Bavuma: సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు

19 Mar, 2023 12:07 IST|Sakshi

SA VS WI 2nd ODI: జాతి వివక్ష.. వర్ణ భేదం.. ఆహార్యంపై వెకిలి మాటలు..జాతీయ జట్టుకు సారధి అయినప్పటికీ, సొంతవారి నుంచే వ్యతిరేకత.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించరాని ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న సౌతాఫ్రికా టెస్ట్‌, వన్డే జట్టు సారధి టెంబా బవుమా.. అవకాశం దొరికిన ప్రతిసారి తనను విమర్శించిన వారికి తన ఆటతీరుతో బదులిస్తున్నాడు.

పేలవ ఫామ్‌ కారణం‍గా ఇటీవలే టీ20 కెప్టెన్సీని కోల్పోయిన బవుమా.. ప్రస్తుతం కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో (118 బంతుల్లో 144; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) విజృంభించిన బవుమా.. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా రెండో శతకాన్ని (విండీస్‌తో రెండో టెస్ట్‌లో 172) బాదాడు. బవుమాకు గత 3 వన్డేల్లో ఇది రెండో శతకం.

ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేసిన బవుమా అంతకుముందు జరిగిన రెండో వన్డేలో 109 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బవుమాను ఓ దశలో టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు జాత్యాహంకారులు డిమాండ్‌ చేశారు.

బవుమా సౌతాఫ్రికా కెప్టెన్‌ కావడం ఇష్టం లేని కొందరు అతను ఒక్క మ్యాచ్‌లో విఫలమైనా పని కట్టుకుని మరీ విమర్శలు చేసేవారు. అలాంటి వారికి బవుమా ప్రతిసారి తన బ్యాట్‌తో సమాధానం చెప్తూ వస్తున్నాడు. తాజా సెంచరీతో బవుమా తన జట్టును గెలిపించలేకపోయినా.. అద్భుతమైన పోరాటపటిమ, ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

విండీస్‌తో రెండో వన్డేలో శైలీకి భిన్నంగా 7 భారీ సిక్సర్లు బాదిన బవుమా విమర్శకులు ముక్కునవేళ్లేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ షాట్లతో పాటు మాస్టర్‌ క్లాస్‌ ఆటను ఆడిన బవుమా..సొగసైన బౌండరీలు కొట్టి, స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ బెస్ట్‌ వన్డే నాక్‌ ఆడాడు. కెరీర్‌ ఆరంభం నుంచే జాత్యాహంకారులకు టార్గెట్‌గా మారిన బవుమా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఏమాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్పడం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది.

క్లిష్ట సమయంలో ముళ్ల కిరీటం లాంటి సౌతాఫ్రికన్‌ కెప్టెన్సీని చేపట్టిన బవుమా.. సారధిగానూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సహచరుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌతాఫ్రికా కెప్టెన్‌గా నియమితుడైన మొట్టమొదటి బ్లాక్‌ అఫ్రికన్‌ అయిన బవుమా.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా, వన్డే అరం‍గేట్రంలో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికన్‌గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా, సౌతాఫ్రికాలో జాతి వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్‌ మండేలా ఎందు కోసం పోరాడాడో యావత్‌ ప్రపంచం చూసింది. కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా కొంత మంది సౌతాఫ్రికన్‌లలో జాత్యాహంకారం బీజాలు పోలేదు. ఈ వరుస సౌతాఫ్రికా క్రికెట్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మోకాలిపై నిలబడాలని క్రికెట్‌ సౌతాఫ్రికా ఆదేశించినా ఆ జట్టు స్టార్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌తో పాటు కొందరు అలా చేసేం‍దుకు నిరాకరించడం ఇందుకు నిదర్శనం. మున్ముందు ఇలా చేయాల్సి వస్తుందేమోనని డికాక్‌ ఏకంగా తన కెరీర్‌నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. గతంలో సౌతాఫ్రికా జట్టులో బ్లాక్స్‌ను వ్యతిరేస్తూ కొందరు స్టార్‌ ఆటగాళ్లు ఏకంగా దేశం వదలి ఇతర దేశాలకు వలస వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

బవుమా లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్‌తో కెప్టెన్‌ స్థాయికి ఎదగడంతో కొందరు కడుపు మంటతో అనునిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. నేషనల్‌ టీమ్‌కు కెప్టెన్‌ అయినప్పటికీ స్వదేశంలో ఇటీవల జరిగిన ఎస్‌ఏ20 లీగ్‌లో బవుమాను ఏ ఫ్రాంచైజీ తీసుకోకుండా ఘోరంగా అవమానించింది. రేసిజమ్‌ కారణంగా ఇలా జరిగిందని క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరిగింది. ఆతర్వాత రీప్లేస్‌మెంట్‌గా బవుమాను ఓ ఫ్రాంచైజీ అక్కును చేర్చుకున్నప్పటికీ ఇది క్రికెట్‌ సౌతాఫ్రికాకు మాయని మచ్చగా మిగిలిపోతుంది.  

కెరీర్‌లో 56 టెస్ట్‌లు, 24 వన్డేలు, 33 టీ20లు ఆడిన బవుమా.. మొత్తంగా 4500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 2 టెస్ట్‌ శతకాలు, 20 అర్ధసెంచరీలు.. 4 వన్డే హండ్రెడ్స్‌, 2 ఫిఫ్టీలు.. ఓ టీ20 హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు