National Chess Championship 2022: డబుల్‌ స్వర్ణ పతకాలు సాధించిన రాజా రిత్విక్‌

16 Apr, 2022 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఓపెన్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. రాజా రిత్విక్, తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి, అరవింద్‌ చిదంబరం (తమిళనాడు), పురాణిక్‌ అభిమన్యు (మహారాష్ట్ర), సంకల్ప్‌ గుప్తా (మహారాష్ట్ర)లతో కూడిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) జట్టు టీమ్‌ విభాగంలో 16 పాయింట్లతో విజేతగా నిలిచింది.

వ్యక్తిగతంగా బోర్డు–5పై ఆడిన రాజా రిత్విక్‌ ఏడు పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి మరో స్వర్ణ పతకాన్ని సాధించాడు. బోర్డు–3పై ఆడిన హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి. పతకాలు నెగ్గిన రాజా రిత్విక్, హర్ష భరతకోటిలను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం'

మరిన్ని వార్తలు