ధోని హ్యాట్రిక్‌ సిక్సర్లు.. పోరాడి ఓడిన సీఎస్‌కే

22 Sep, 2020 23:40 IST|Sakshi

షార్జా: ఐపీఎల్‌-13లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పోరాడి ఓడింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడినా డుప్లెసిస్‌(72; 37 బంతుల్లో 1 ఫోర్‌ 7 సిక్సర్లు), ఎంఎస్‌ ధోని(29 నాటౌట్‌; 17 బంతుల్లో 3 సిక్సర్లు)లు అలరించారు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే, చివర్లో ధోని బ్యాట్‌కు పనిచెప్పాడు. కాగా, అప్పటికే నష్టం జరిగిపోవడంతో సీఎస్‌కే ఓటమి తప్పలేదు. కాగా, టామ్‌ కరాన్‌ వేసిన చివరి ఓవర్‌లో ధోని హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు.(చదవండి:అరంగేట్రంలోనే గోల్డెన్‌ డక్‌)

రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మురళీ విజయ్‌-వాట్సన్‌లు దూకుడుగా ఆడారు. వాట్సన్‌ నాలుగు సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. ఇక విజయ్‌ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కాగా, వీరి ఇన్నింగ్స్‌కు 56 పరుగుల వద్ద తెరపడింది.  వాట్సన్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కాసేపటికి విజయ్‌ ఔటయ్యాడు. ఆపై సామ్‌ కరాన్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మంచి ఊపుమీద కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. గైక్వాడ్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో చెన్నై కష్టాల్లో పడింది. తొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి సామ్‌ కరాన్‌ స్టంపౌట్‌ అవ్వగా, ఆ తర్వాత బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌ అదే తరహాలో నిష్క్రమించాడు. దాంతో సీఎస్‌కే 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు మురళీ విజయ్‌(21), షేన్‌  వాట్సన్‌(33)లు ఔటయ్యారు. సీఎస్‌కే ఆరంభం బాగున్నా, మధ్యలో వికెట్లు కోల్పోవడంతో చెన్నై పరుగుల వేటలో వెనుకబడింది. రాజస్తాన్‌ బౌలర్లలో తెవాతియా మూడు వికెట్లు సాధించగా, ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, టామ్‌ కరాన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

ముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో  మరిపించాడు. సీఎస్‌కే బౌలర్లను చితక్కొడుతూ చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్‌(6) ఔటైన తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచింది. టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఎలా ఉండాలో చూపిస్తూ ఎంఎస్‌ ధోనికి బ్రెయిన్‌కు పదును పెట్టాడు. రవీంద్ర జడేజాను రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత పీయూష్‌ చావ్లాను బౌలింగ్‌కు దింపగా, అతన్ని కూడా ఉతికి ఆరేశాడు. 32 బంతుల్లో 1 ఫోర్‌,. 9 సిక్స్‌లతో 74 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిశాడు. ఆర్చర్‌ 8 బంతుల్లో 4 సిక్స్‌లతో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఎన్‌గిడి, చావ్లా, దీపక్‌ చాహర్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు