చెన్నై చతికిలపడింది

20 Oct, 2020 05:07 IST|Sakshi

ఏడో ఓటమితో ధోని జట్టుకు ప్లే ఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టం

రాజస్తాన్‌ రాయల్స్‌కు కీలక గెలుపు

రాణించిన స్పిన్నర్లు గోపాల్, తేవటియా

బట్లర్‌ అర్ధ సెంచరీ

‘ఒకే రోజు మూడు సూపర్‌ ఓవర్లతో ఐపీఎల్‌లో అద్భుతం చూశారు కదా... రేపు టెస్టు మ్యాచ్‌ చూడవచ్చు, లెక్క సరిపోతుంది’... ఆదివారం ఒక సగటు క్రికెట్‌ అభిమాని సరదా వ్యాఖ్య ఇది. ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరు ఏమాత్రం ఆసక్తి రేపకుండా చప్పగా సాగింది. పరుగు తీయడమే కష్టంగా మారినట్లు, బౌండరీ బాదడం అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టాలేమో అన్నంత భారంగా చెన్నై బ్యాటింగ్‌ చేసింది. ఛేదనలో రాజస్తాన్‌ కూడా తడబడ్డా... స్మిత్, బట్లర్‌ భాగస్వామ్యంతో కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 బంతుల్లో అభేద్యంగా 98 పరుగులు జోడించి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.  

అబుదాబి: ఐపీఎల్‌లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్‌ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి ముందంజ వేయడంపై ఆశలు వదులుకోవాల్సిందే! సీజన్‌ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్‌ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ఎమ్మెస్‌ ధోని (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాస్‌ బట్లర్‌ (48 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (34 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు.  

సమష్టి వైఫల్యం...
మ్యాచ్‌ మ్యాచ్‌కూ మరింత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై జట్టు బ్యాటింగ్‌ బలహీనత మరోసారి కనిపించింది. ఇన్నింగ్స్‌ మొత్తంలో 12 ఫోర్లు, 1 సిక్స్‌ మాత్రమే ఉండగా... భారీ షాట్లు ఆడే ప్రయత్నం కూడా బ్యాట్స్‌మెన్‌ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. పేరుకు ధోని, జడేజా మధ్య 51 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నా... అదీ 46 బంతుల్లో రావడం దూకుడులేమిని స్పష్టంగా చూపించింది. డు ప్లెసిస్‌ (10)ను తొందరగా అవుట్‌ చేసి రాజస్తాన్‌కు ఆర్చర్‌ శుభారంభం అందించాడు. యువ బౌలర్‌ త్యాగి తన తొలి ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చినా... అదే ఓవర్లో వాట్సన్‌ (8)ను వెనక్కి పంపించాడు. స్టోక్స్‌ వేసిన ఐదో ఓవర్లో చెన్నై 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 43 పరుగులకు చేరింది. ఆ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో స్యామ్‌ కరన్‌ (25 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌), రాయుడు (13) వెనుదిరిగారు. 10 ఓవర్లలో 56 పరుగులు చేసిన చెన్నై స్కోరు 15 ఓవర్లలో 89 పరుగులకు చేరింది. అనంతరం రెండో పరుగు తీసే ప్రయత్నంలో ధోని రనౌటయ్యాడు. జడేజా చలవతో ఆఖరి 5 ఓవర్లలో 3 ఫోర్లతో చెన్నై 36 పరుగులు జోడించగలిగింది.  

49 బంతుల తర్వాత...
చెన్నై ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ చివరి బంతికి రాయుడు ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత జట్టు మరో బౌండరీ కోసం ఏకంగా 8.1 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. త్యాగి వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి త్యాగి ధోని మళ్లీ ఫోర్‌ కొట్టాడు. ఒక టి20 మ్యాచ్‌లో రెండు బౌండరీల మధ్య విరామం 49 బంతులు! రాజస్తాన్‌ ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లు శ్రేయస్‌ గోపాల్, రాహుల్‌ తేవటియా ఎంతో ప్రభావం చూపించారు. వీరిద్దరు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 8 ఓవర్లలో కలిపి 32 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశారు. పైగా ఒక్క ఫోర్‌ కూడా ఇవ్వకపోవడం విశేషం.

భారీ భాగస్వామ్యం...
రాజస్తాన్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే పేలవ షాట్లతో స్టోక్స్‌ (19), ఉతప్ప (4), సామ్సన్‌ (0) వెనుదిరిగారు. ఈ దశ లో స్మిత్, బట్లర్‌ కూడా సమర్థంగా ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఛేదించాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో ఆడారు. బట్లర్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, స్మిత్‌ అతడికి సహకరించాడు. శార్దుల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్‌... చావ్లా ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ సీజన్‌లో మేం ఇక  ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4–5 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో.   
–ఎమ్మెస్‌ ధోని, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌  

ధోని@200
ఐపీఎల్‌లో ధోని 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్‌లు చెన్నై తరఫున ఆడగా... చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున మరో 30 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్‌లో ధోని మొత్తం 4,596 పరుగులు సాధించగా... తాజా మ్యాచ్‌తో ఒక్క సీఎస్‌కే తరఫునే ధోని ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: స్యామ్‌ కరన్‌ (సి) బట్లర్‌ (బి) గోపాల్‌ 22; డు ప్లెసిస్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 10; వాట్సన్‌ (సి) తేవటియా (బి) త్యాగి 8; రాయుడు (సి) సామ్సన్‌ (బి) తేవటియా 13; ధోని (రనౌట్‌) 28; జడేజా (నాటౌట్‌) 35; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 125.  
వికెట్ల పతనం: 1–13; 2–26; 3–53; 4–56; 5–107.
బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–20–1; అంకిత్‌ రాజ్‌పుత్‌ 1–0–8–0; కార్తీక్‌ త్యాగి 4–0–35–1; స్టోక్స్‌ 3–0–27–0; శ్రేయస్‌ గోపాల్‌ 4–0–14–1; రాహుల్‌ తేవటియా 4–0–18–1.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: స్టోక్స్‌ (బి) చహర్‌ 19; ఉతప్ప (సి) ధోని (బి) హాజల్‌వుడ్‌ 4; సామ్సన్‌ (సి) ధోని (బి) చహర్‌ 0; స్మిత్‌ (నాటౌట్‌) 26; బట్లర్‌ (నాటౌట్‌) 70; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 126.  
వికెట్ల పతనం: 1–26; 2–28; 3–28.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–1–18–2; హాజల్‌వుడ్‌ 4–0–19–1; జడేజా 1.3–0–11–0; శార్దుల్‌ 4–0–34–0; స్యామ్‌ కరన్‌ 1–0–6–0; చావ్లా 3–0–32–0.  

>
మరిన్ని వార్తలు