పరుగుల హోరులో రాజస్తాన్‌ దరహాసం

27 Sep, 2020 23:19 IST|Sakshi

షార్జా:  కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌  అద్భుతమైన విజయాన్ని సాధించింది. కింగ్స్‌ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సాధించి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు రాజస్తాన్‌ విజయంలో కీలక  పాత్ర పోషించారు. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(4) విఫలమైనా, స్టీవ్‌ స్మిత్‌, సంజూ శాంసన్‌ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. 9 ఓవర్ల ముగిసే సరికి రాజస్తాన్‌ రాయల్స్‌ 100 పరుగుల మార్కును దాటడంతో రాజస్తాన్‌ సునాయాసంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్‌ చివరి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ఒకవైపు శాంసన్‌ పరుగుల మోత మోగిస్తుంటే, తెవాతియా తొలుత ఆపసోపాలు పడ్డాడు. కానీ ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.  శాంసన్‌ ఔటైన తర్వాత తెవాతియా బ్యాట్‌కు పని చెప్పడంతో రాజస్తాన్‌ చివరకు విజయాన్ని నమోదు చేసింది. ఆఖర్లో ఆర్చర్‌ (13 నాటౌట్‌) 3 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టడంతో రాజస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ టార్గెట్‌లో ఇంకా మూడు బంతులు ఉండగానే రాజస్తాన్‌ గెలుపును అందుకుంది.

గేమ్‌ ఛేంజర్‌ తెవాతియా
ఈ మ్యాచ్‌లో గేమ్‌ ఛేంజర్‌ తెవాతియానే. తొలుత స్మిత్‌, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాతియా ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్‌ డౌన్‌లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాతియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. దానికి తగ్గట్టుగానే తెవాతియా తొలుత తడబడ్డాడు. కానీ శాంసన్‌ ఔటైన తర్వాత మొత్తం గేమ్‌ స్వరూపాన్నే మార్చేశాడు తెవాతియా. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను ఛేంజ్‌ చేసేశాడు. ఈ మ్యాచ్‌లో గేమ్‌ ఛేంజర్‌ తెవాతియానే.  ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ ఆడిన ఆ ఓవర్‌ కింగ్స్‌కు విజయాన్ని దూరం చేసింది.

అంతకుముందు టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, మయాంక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ వచ్చీ రావడంతోనే రాజస్తాన్‌ రాయల్స్‌కు చుక్కలు చూపించారు. ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే తొలుత మయాంక్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై రాహుల్‌ అర్థ శతకం సాధించాడు.  మయాంక్‌ ధాటిగా ఆడటంతో రాహుల్‌ ఎక్కువ  స్టైక్‌ ఇస్తూ అతన్ని ఉత్తేజ పరిచాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్న మయాంక్‌ సెంచరీ నమోదు చేశాడు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. 50 బంతుల్లో  10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసిన తర్వాత మయాంక్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. టామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ పెవిలియన్‌ చేరగా, రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. మయాంక్‌ ఔటైన మరుసటి ఓవర్‌లోనే రాహుల్‌ నిష్క్రమించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్(13 నాటౌట్‌; 9 బంతుల్లో 2ఫోర్లు)‌, పూరన్‌(25 నాటౌట్‌; 8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు)లు ధాటిగా ఆడటంతో  కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి  223 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు