IPL 2021, RR vs SRH: అదే కథ... అదే వ్యథ

3 May, 2021 04:58 IST|Sakshi

సన్‌రైజర్స్‌కు ఆరో ఓటమి

విలియమ్సన్‌ సారథ్యంలోనూ మారని రాత

రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో 55 పరుగుల తేడాతో పరాజయం

బట్లర్‌ మెరుపు శతకం

న్యూఢిల్లీ: అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఐపీఎల్‌లో ఆరో ఓటమిని ఆహ్వానించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. డేవిడ్‌ వార్నర్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి విలియమ్సన్‌కు పగ్గాలు అప్పగించినా హైదరాబాద్‌ తలరాత మారలేదు. తొలుత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు సాధించింది.

బట్లర్‌ (64 బంతుల్లో 124; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్‌ సామ్సన్‌ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి చక్కటి సహకారం అందించాడు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి ఓడింది. మనీశ్‌ పాండే (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌ లు), బెయిర్‌ స్టో (21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. ముస్తఫిజుర్‌ (3/20), మోరిస్‌ (3/29) హైదరాబాద్‌కు కళ్లెం వేశారు.

బట్లర్‌ మెరుపులు...
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించింది. రషీద్‌ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి టచ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్‌ (12) ఆ ఓవర్‌ చివరి బంతికి అవుటయ్యాడు. రషీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ నాలుగో బంతి బట్లర్‌ ప్యాడ్‌లకు తగిలింది. రషీద్‌ అప్పీల్‌ చేసినా అంపైర్‌ తిరస్కరించాడు. అయితే అప్పటికే సన్‌రైజర్స్‌ తమ వద్ద ఉన్న ఒక్క రివ్యూను కోల్పోవడంతో మళ్లీ రివ్యూ కోరలేకపోయింది. టీవీ రిప్లేలో మాత్రం బట్లర్‌ వికెట్ల ముందు దొరికిపోయినట్లు కనిపిం చింది.  అప్పటికి బట్లర్‌ ఏడు పరుగులతో ఉన్నాడు. యశస్వి అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సామ్సన్‌ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఖాతా తెరిచాడు. మరో ఎండ్‌లో  బట్లర్‌ కూడా అడపాదడపా బౌండరీలు బాదాడు.

దాంతో రాజస్తాన్‌ 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. ఇక్కడి నుంచి గేర్‌ మార్చిన బట్లర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకదశలో 30 బంతుల్లో 32 పరుగులు చేసిన అతను... నబీ వేసిన 15వ ఓవర్లో 6, 4, 4, 6 బాదాడు. మరోవైపు శంకర్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన సామ్సన్‌ అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 150 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 17వ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసిన బట్లర్‌ 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. టి20 కెరీర్‌లో అతడికిదే తొలి శతకం. సందీప్‌ వేసిన 19వ ఓవర్లో 6, 4, 6, 6 కొట్టిన అతను ఆ ఓవర్‌ చివరి బంతికి బౌల్డయ్యాడు. చివరి 10 ఓవర్లలో రాజస్తాన్‌ 143 పరుగులు సాధించింది.   

ఆరంభం లభించినా...
కెప్టెన్సీ కోల్పోయిన వార్నర్‌కు తుది జట్టులోనూ చోటు దక్కలేదు. దాంతో ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన మనీశ్‌ పాండే... బెయిర్‌స్టోతో కలిసి సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. లక్ష్యం భారీగా ఉండటంతో వీరిద్దరూ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. పవర్‌ప్లేలో హైదరాబాద్‌  వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఈ దశలో ముస్తఫిజుర్‌ హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. స్లో డెలివరీతో మనీశ్‌ను బోల్తా కొట్టించాడు. దూకుడు మీదున్న బెయిర్‌స్టో... తెవాటియా బౌలింగ్‌లో లాంగాన్‌ దగ్గర రావత్‌ చేతికి చిక్కాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న విలియమ్సన్‌ (21 బంతుల్లో 20, 1 ఫోర్‌), విజయ్‌ శంకర్‌ (8) వెంటవెంటనే అవుటయ్యారు. నబీ (5 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్‌ చేరాడు. దాంతో 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ 129/5గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఆడకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి ఖాయమైంది.

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (బి) సందీప్‌ శర్మ 124; జైస్వాల్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ ఖాన్‌ 12; సామ్సన్‌ (సి) సమద్‌ (బి) విజయ్‌ శంకర్‌ 48; పరాగ్‌ (నాటౌట్‌) 15; మిల్లర్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 220.

వికెట్ల పతనం: 1–17, 2–167, 3–209.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0– 37–0, సందీప్‌ శర్మ 4–0–50–1, రషీద్‌ 4–0–24–1, ఖలీల్‌ 4–0–  41–0, శంకర్‌ 3–0– 42–1, నబీ 1–0–21–0.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: పాండే (బి) ముస్తఫిజుర్‌ 31; బెయిర్‌స్టో (సి) రావత్‌ (బి) తెవాటియా 30; విలియమ్సన్‌ (సి) మోరిస్‌ (బి) కార్తీక్‌ త్యాగి 20; విజయ్‌ శంకర్‌ (సి) మిల్లర్‌ (బి) మోరిస్‌ 8; జాదవ్‌ (బి) మోరిస్‌ 19; నబీ (సి) రావత్‌ (బి) ముస్తఫిజుర్‌ 17; సమద్‌ (సి) రావత్‌ (బి) మోరిస్‌ 10; రషీద్‌ (సి) మోరిస్‌ (బి) ముస్తఫిజుర్‌ 0; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 14; సందీప్‌ శర్మ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165.

వికెట్ల పతనం: 1–57, 2–70, 3–85, 4–105, 5–127, 6–142, 7–142, 8–143.
బౌలింగ్‌: త్యాగి 4–0–32–1, ముస్తఫిజుర్‌ 4–0–20–3, సకారియా 4–0– 38–0, మోరిస్‌ 4–0–29–3, తెవాటియా 4–0–45–1.

మరిన్ని వార్తలు