శాంసన్‌ జోరు.. ఆర్చర్‌ హోరు

22 Sep, 2020 21:29 IST|Sakshi
సంజా శాంసన్‌(ఫోటో కర్టసీ: పీటీఐ)

షార్జా: ఐపీఎల్‌-13లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ మోత మోగించింది. సీఎస్‌కే టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకోవడంతో బ్యాటింగ్‌ ఆరంభించిన రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో ఉతికి ఆరేసింది. ఈ సీజన్‌లో తొలిసారి రెండొందల పరుగుల మార్కును దాటించింది. ఆదిలో శాంసన్‌ సిక్సర్లతో హోరెత్తించగా, చివర్లో ఆర్చర్‌ మెరుపులు మెరిపించాడు.  మ్యాచ్‌ 19 ఓవర్‌ వరకూ ఒక ఎత్తైతే, చివరి ఓవర్‌ పూర్తిగా మారిపోయింది. ఎన్‌గిడి వేసిన ఆఖరి ఓవర్‌లో ఆర్చర్‌ వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.  ఒకే ఓవర్‌లో ఆర్చర్‌ 4 సిక్స్‌లతో 25  పరుగులు సాధించగా, మొత్తంగా 30 పరుగులు వచ్చాయి. దాంతో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్స్‌లు వచ్చాయి.(చదవండి: పడిక్కల్‌పై గంగూలీ ప్రశంసలు)

సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో  మరిపించాడు. సీఎస్‌కే బౌలర్లను చితక్కొడుతూ చుక్కలు చూపించాడు. యశస్వి జైస్వాల్‌(6) ఔటైన తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. ప్రధానంగా సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచింది. టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఎలా ఉండాలో చూపిస్తూ ఎంఎస్‌ ధోనికి బ్రెయిన్‌కు పదును పెట్టాడు. రవీంద్ర జడేజాను రెండు సిక్స్‌లు కొట్టిన తర్వాత పీయూష్‌ చావ్లాను బౌలింగ్‌కు దింపగా, అతన్ని కూడా ఉతికి ఆరేశాడు. 32 బంతుల్లో 1 ఫోర్‌,. 9 సిక్స్‌లతో 74 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(69; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిశాడు. ఆర్చర్‌ 8 బంతుల్లో 4 సిక్స్‌లతో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో సామ్‌ కరాన్‌ మూడు వికెట్లు సాధించగా, ఎన్‌గిడి, చావ్లా, దీపక్‌ చాహర్‌లు తలో వికెట్‌ తీశారు.(చదవండి:రికార్డు బ్రేక్‌ చేసిన ఐపీఎల్‌ మ్యాచ్‌)

మరిన్ని వార్తలు