ఆఖరి ఓవర్లలో... ఆరేశారు 

28 Sep, 2020 02:57 IST|Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ అసాధారణ విజయం

సిక్సర్లతో 224 లక్ష్యం ఉఫ్‌

తేవటియా సంచలన బ్యాటింగ్‌

చెలరేగిన స్మిత్, సామ్సన్‌

కొట్టుకుపోయిన మయాంక్‌ శతకం

ఈల... గోల... లేని మ్యాచ్‌లో బంతి డీలా పడింది. ఇరు జట్ల బ్యాటింగ్‌ విధ్వంసం ముందు బౌలింగే మోకరిల్లింది. బంతి తీరాన్ని తాకిన అలల్లా పదే పదే బౌండరీ లైన్‌ను తాకింది. నోరులేకపోయినా... బంతి మాత్రం మైదానం మొత్తం గగ్గోలు పెట్టింది. కింగ్స్‌ ఓపెనర్లు మయాంక్, రాహుల్‌ వీరవిహారానికి తెరలేపితే... రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్, సామ్సన్, రాహుల్‌ తేవటియా విజృంభణతో తెర వేశారు. 224 పరుగుల లక్ష్యం కూడా సిక్సర్ల జాతరలో చిన్నబోయింది. విజయం అసాధ్యమనుకుంటే ఇంకో 3 బంతులు మిగిలుండగానే రాజస్తాన్‌కు సుసాధ్యమైంది.   

షార్జా: బ్యాట్‌ను బ్యాటే గెలిచింది. విధ్వంసాన్ని విధ్వంసమే జయించింది. కొండంత లక్ష్యం సిక్సర్ల పిడుగులతో కరిగిపోయింది. ఐపీఎల్‌ టి20 టోర్నీలో రాజస్తాన్‌ రాయల్స్‌ అసాధారణ విజయం సాధించింది. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ లక్ష్యానికి పునాది వేయగా... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజూ సామ్సన్‌ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) గెలుపుదారిన మళ్లించాడు. వీరిద్దరి శ్రమకు రాహుల్‌ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) సంచలనాన్ని జతచేశాడు. 224 పరుగుల అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీస్కోరు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (50 బంతుల్లో 106; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదగా, కెప్టెన్‌ రాహుల్‌ (54 బంతుల్లో 69; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్తాన్‌ జట్టులో మిల్లర్, యశస్వి జైస్వాల్‌ స్థానాల్లో బట్లర్, అంకిత్‌ రాజ్‌పుత్‌లను తుది జట్టులోకి తీసుకుంది. 

కింగ్స్‌ ధనాధన్‌ 100... 
రాజస్తాన్‌ బౌలర్ల పాలిట మయాంక్, లోకేశ్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ‘కింగ్స్‌’ అయ్యారు. బంతి పడితే... మేం బాదితే... ఇక అంతే! అన్నట్లుగా ఓపెనర్ల విధ్వంసరచన సాగింది. జట్టు స్కోరు 50 పరుగులు చేరేందుకు 27 బంతులే (4.3 ఓవర్లు) అవసరమయ్యాయి. ఇవి వందగా మారేందుకు 53 బంతులే (8.4) సరిపోయాయి. మరో 60 బంతులు (18.5) పడేసరికి ఆ వంద కాస్తా 200 పరుగుల ప్రవాహమైంది. ఈ 20 ఓవర్లలో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌండరీలైను బతికిపోయింది. 16 ఓవర్ల పాటు 31 సార్లు బంతి సిక్స్‌ లేదంటే ఫోర్‌గా రేఖ దాటింది.  

రాయల్స్‌ చేజింగ్‌... 
యమ స్పీడ్‌గా ఆడిన స్మిత్‌ ఔటయ్యాడు. స్పీడ్‌ను కొనసాగించిన సామ్సన్‌ నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న తేవటియా అగచాట్లు పడుతున్నాడు. 17 ఓవర్ల వద్ద రాజస్తాన్‌ స్కోరు 173/3. మిగిలినవి 18 బంతులే. చేయాల్సినవి 51 పరుగులు. అంటే ఆఖరి 3 ఓవర్లలో 17 పరుగుల చొప్పున చేయాలి. అప్పుడు సాగింది కాట్రెల్‌ బౌలింగ్‌... తేవటియా బ్యాటింగ్‌... 6, 6, 6, 6, 0, 6 లాంగ్‌లెగ్, బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్, లాంగాఫ్, మిడ్‌ వికెట్, బంతి గ్యాప్‌ తర్వాత మళ్లీ మిడ్‌ వికెట్‌ల మీదుగా మొత్తం 5 సిక్స్‌లు. అంతే సమీకరణం మారింది. రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం ఫటాఫట్‌గా మారిపోయింది. 

స్మిత్‌ మెరుపులతో... 
ఏ రకంగా చూసినా... 224 పరుగులు అసాధ్యమైన లక్ష్యమే. ఓవర్‌కు 11 పరుగుల పైగా బాదితేనే రాజస్తాన్‌ గెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బట్లర్‌ (4) చేతులెత్తేయగా... స్మిత్, సామ్సన్‌తో కలిసి మెరుపు షాట్లతో ఆశలు రేపాడు. అతని జోరుతో రాయల్స్‌ అచ్చూ కింగ్స్‌లాగే దూకుడుగా సాగిపోయింది. మయాంక్‌లాగే స్మిత్‌ 26 బంతుల్లోనే (7ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. కానీ జట్టు స్కోరు 100 పరుగుల వద్ద అతని మెరుపులకు నిషమ్‌ అడ్డుకట్ట వేయడంతో జోరు తగ్గింది. తేవటియా బంతులు వృథా చేశాడు. మరోవైపు సామ్సన్‌ చెలరేగడం మొదలు పెట్టడంతో మళ్లీ ఆశలు చిగిరించాయి. కానీ ఇతన్ని షమీ ఔట్‌ చేయడంతో రాజస్తాన్‌కు లక్ష్యం భారంగా మారి విజయానికి దూరమైంది. ఈ దశలో తేవటియా తన ఆటతో మ్యాచ్‌తీరే మార్చేశాడు. దాంతో మూడు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్‌ నెగ్గింది.    

మయాంక్‌ సూపర్‌ సెంచరీ 
అంతకుముందు రాహుల్‌తో పరుగులు మొదలుపెట్టిన మయాంక్‌ తానెదుర్కొన్న నాలుగో బంతి (1.3 ఓవర్‌)తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. మిడాఫ్‌లో భారీ సిక్సర్‌ బాదిన ఈ ఓపెనర్‌ ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూసుకోనేలేదు. ఏ బౌలర్‌ వచ్చిన విడిచి పెట్టలేదు. కుదిరితే ఫోర్, బాగా కుదిరితే సిక్సర్‌ ఇలా అతని బ్యాటింగ్‌ కొనసాగింది. మరోవైపు కెప్టెన్‌ రాహుల్‌ కూడా ధాటిగా ఆడటంతో ఈ మ్యాచ్‌ లైవ్‌ మ్యాచ్‌గా కాకుండా హైలైట్స్‌ను తలపించింది. 26 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) మయాంక్‌ ఫిఫ్టీ పూర్తయింది. కొంచెం ఆలస్యమైనా రాహుల్‌ 35 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ అధిగమించాడు. అరుపులు లేని చోట వీరిద్దరి మెరుపులు వాటిని భర్తీ చేశారు. ప్రేక్షకులెవరూ ఓవర్‌ బ్రేక్‌లోనూ చానల్‌ మార్చే సాహసం చేయలేనంతగా ఈ ఓపెనింగ్‌ జోడీ ప్రతాపం చూపింది. 45 బంతుల్లోనే (9 ఫోర్లు, 7 సిక్సర్లు) మయాంక్‌ శతక్కొట్టాడు. ఆ తర్వాతే టామ్‌ కరన్‌ అతన్ని ఔట్‌చేయగలిగాడు. దీంతో 183 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రాహుల్‌ ఆట ముగియగా... పూరన్‌ (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్సర్లతో) జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకెళ్లాడు. 

స్కోరు వివరాలు
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌:
లోకేశ్‌ రాహుల్‌ (సి) గోపాల్‌ (బి) అంకిత్‌ రాజ్‌పుత్‌ 69; మయాంక్‌ అగర్వాల్‌ (సి) సంజూ సామ్సన్‌ (బి) టామ్‌ కరన్‌ 106; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 13; పూరన్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. 
వికెట్ల పతనం: 1–183, 2–194.
బౌలింగ్‌: జైదేవ్‌ ఉనాద్కట్‌ 3–0–30–0, అంకిత్‌ రాజ్‌పుత్‌ 4–0–39–1, ఆర్చర్‌ 4–0–46–0, శ్రేయస్‌ గోపాల్‌ 4–0–44–0, రాహుల్‌ తేవటియా 1–0–19–0, టామ్‌ కరన్‌ 4–0–44–1.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జోస్‌ బట్లర్‌ (సి) సర్ఫరాజ్‌ (బి) కాట్రెల్‌ 4; స్టీవ్‌ స్మిత్‌ (సి) షమీ (బి) నీషమ్‌ 50; సంజూ సామ్సన్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 85; రాహుల్‌ తేవటియా (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) షమీ 53; ఉతప్ప (సి) పూరన్‌ (బి) షమీ 9; ఆర్చర్‌ (నాటౌట్‌) 13; రియాన్‌ పరాగ్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 0; టామ్‌ కరన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 226.  
వికెట్ల పతనం: 1–19, 2–100, 3–161, 4–203, 5–222, 6–222.
బౌలింగ్‌: కాట్రెల్‌ 3–0–52–1, షమీ 4–0–53–3, రవి బిష్ణోయ్‌ 4–0–34–0, నీషమ్‌ 4–0–40–1, మురుగన్‌ అశ్విన్‌ 1.3–0–16–1, మ్యాక్స్‌వెల్‌ 3–0–29–0.

మరిన్ని వార్తలు