‘సిక్సర్ల సంజూ’ 

23 Sep, 2020 02:33 IST|Sakshi

సామ్సన్‌ మెరుపు బ్యాటింగ్‌

రాణించిన స్మిత్, ఆర్చర్‌ 

రాజస్తాన్‌ రాయల్స్‌ బోణీ

16 పరుగులతో చెన్నై ఓటమి

రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ సునామీలో సూపర్‌ కింగ్స్‌ నిలబడలేకపోయింది. ముందుగా సామ్సన్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడితే, చివర్లో ఆర్చర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మధ్యలో స్మిత్‌ తనదైన శైలిలో సాధికారిక బ్యాటింగ్‌ చేయడంతో భారీ స్కోరు సాధించిన రాయల్స్‌... ఆ తర్వాత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి పని పట్టింది. ఐపీఎల్‌–2020లో సూపర్‌ విజయంతో బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన ఉత్సాహంతో రెండో పోరుకు సిద్ధమైన ధోని సేన పదును లేని బౌలింగ్, ఆ తర్వాత పేలవ బ్యాటింగ్‌తో కుప్పకూలింది. చివర్లో డు ప్లెసిస్, ధోని కొంత పోరాడినా లాభం లేకపోయింది. మ్యాచ్‌లో మొత్తం 33 సిక్సర్లు నమోదు కావడం విశేషం. 2010 తర్వాత ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై తొలుత బ్యాటింగ్‌కు దిగి రాజస్తాన్‌ రాయల్స్‌ నెగ్గడం ఇదే తొలిసారి.   

షార్జా: ఐపీఎల్‌ జట్లలో స్టార్లు లేని టీమ్‌గా కనిపిస్తున్న రాజస్తాన్‌ రాయల్స్‌ అద్భుత ప్రదర్శనతో లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 16 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజూ సామ్సన్‌ (32 బంతుల్లో 74; 1 ఫోర్, 9 సిక్సర్లు) దూకుడుకు తోడు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (47 బంతుల్లో 69; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జోఫ్రా ఆర్చర్‌ (8 బంతుల్లో 27 నాటౌట్‌; 4 సిక్సర్లు) చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమైంది. సామ్సన్, స్మిత్‌ రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి ఓడింది. డు ప్లెసిస్‌ (37 బంతుల్లో 72; 1 ఫోర్, 7 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షేన్‌ వాట్సన్‌ (21 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.  

సూపర్‌ ఇన్నింగ్స్‌... 
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సామ్సన్‌ తాను ఎదుర్కొన్న ఐదో బంతితో విధ్వంసం మొదలు పెట్టాడు. స్యామ్‌ కరన్‌ వేసిన ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన అతను జడేజా ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక చావ్లా వేసిన ఓవర్లోనైతే అతను పండగ చేసుకున్నాడు. ఈ ఓవర్లో 3 సిక్సర్లు కొట్టిన సామ్సన్‌ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడు తగ్గించకుండా ఆడిన అతను మరో రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. చివరకు ఇన్‌గిడి బౌలింగ్‌లో ఇదే తరహా షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చహర్‌కు చిక్కడంతో సామ్సన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. సామ్సన్‌ 58 పరుగులు బౌండరీల రూపంలోనే సాధించడం విశేషం.  

స్మిత్‌ నిలబడగా... 
ఒక ఎండ్‌లో విధ్వంసం సాగిస్తే మరో ఎండ్‌లో జాగ్రత్తగా ఆడే వ్యూహంతో కెప్టెన్‌ స్మిత్‌ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే సుదీర్ఘ కెరీర్‌లో అతను ఓపెనింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. సామ్సన్‌ చెలరేగుతున్న సమయంలో అతనికి అండగా నిలిచిన స్మిత్‌ తాను కూడా కొన్ని చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. చావ్లా బౌలింగ్‌లో తాను దూకుడు ప్రదర్శించి రెండు భారీ సిక్సర్లు బాదాడు. 35 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తి కాగా, 19వ ఓవర్‌ రెండో బంతి వరకు నిలిచి కరన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.  

ఆర్చర్‌ అదరహో... 
6, 6, 6, 6... ఇన్‌గిడి వేసిన చివరి ఓవర్లో ఆర్చర్‌ బీభత్సం ఇది. మైదానం బయట పడుతున్నాయా అన్నట్లుగా ఒకదాని వెంట మరో భారీ సిక్సర్‌తో ఆర్చర్‌ చెలరేగిపోయాడు. ఇందులో రెండు బంతులు ‘నోబాల్స్‌’ కూడా కావడం అతనికి కలిసొచ్చింది. మరో రెండు సింగిల్స్‌ కూడా తీసిన జోఫ్రా మొత్తం 26 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. సామ్సన్‌ వెనుదిరిగిన తర్వాత 44 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే జోడించిన రాజస్తాన్‌ స్కోరు 200 పరుగులు కూడా దాటగలదా అన్న దశలో ఆర్చర్‌ మెరుపులు భారీ స్కోరునందించాయి.  

పాపం చావ్లా, ఇన్‌గిడి... 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో 5 అర్ధసెంచరీలు నమోదయ్యాయి! బ్యాటింగ్‌లో సామ్సన్, స్మిత్‌ హాఫ్‌ సెంచరీలు చేయగా... బౌలర్లు పీయూష్‌ చావ్లా, ఇన్‌గిడి, టామ్‌ కరన్‌ కూడా ఆ మార్క్‌లు దాటారు. సామ్సన్‌ బాదుడుతో ఒకే ఓవర్లో 28 పరుగులు సహా చావ్లా మొత్తం 55 పరుగులు ఇవ్వగా... చివరి ఓవర్లో ఆర్చర్‌ జోరు కారణంగా ఇన్‌గిడి స్కోరు 56కు చేరింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ తప్పడంతో తొలి 2 బంతులకే అతను 27 పరుగులు ఇచ్చినట్లయింది. తన బౌలింగ్‌లో 6 సిక్సర్లు ఇచ్చిన టామ్‌ కరన్‌ కూడా ఈ జాబితాలో చేరాడు.  

కరన్‌ బ్రదర్స్‌... 
సొంత అన్నదమ్ములు టామ్‌ కరన్, స్యామ్‌ కరన్‌ ఇప్పటి వరకు సీనియర్‌ స్థాయి క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి ఒకే జట్టులో కలిసి 105 మ్యాచ్‌లలో ఆడారు. కానీ ప్రత్యర్థులుగా తలపడటం మాత్రం ఇదే తొలిసారి.

సమష్టి వైఫల్యం... 
భారీ ఛేదనలో చెన్నైకి ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలో వాట్సన్‌ కొంత దూకుడుగా ఆడటం మినహా మిగిలిన బ్యాటింగ్‌ గతి తప్పింది. విజయ్‌ (21 బంతుల్లో 21) విఫలం కాగా... కరన్‌ (17), జాదవ్‌ (22) ప్రభావం చూపించలేకపోయారు. తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన రుతురాజ్‌ (0) తొలి బంతికే వెనుదిరగ్గా... డు ప్లెసిస్‌ దూకుడైన ప్రదర్శన గెలిచేందుకు సరిపోలేదు. ఇక 38 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన ధోని (17 బంతుల్లో 29 నాటౌట్‌; 3 సిక్సర్లు) చివరి ఓవర్లో వరుసగా మూడు భారీ సిక్సర్లతో చెలరేగినా అది గెలుపునకు పనికి రాలేదు.  

స్కోరు వివరాలు
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి అండ్‌ బి) చహర్‌ 6; స్మిత్‌ (సి) జాదవ్‌ (బి) స్యామ్‌ కరన్‌ 69; సామ్సన్‌ (సి) చహర్‌ (బి) ఇన్‌గిడి 74; మిల్లర్‌ (రనౌట్‌) 0; ఉతప్ప (సి) డు ప్లెసిస్‌ (బి) చావ్లా 5; తెవాటియా (ఎల్బీ) (బి) స్యామ్‌ కరన్‌ 10; పరాగ్‌ (సి) ధోని (బి) స్యామ్‌ కరన్‌ 6; టామ్‌ కరన్‌ (నాటౌట్‌) 10; ఆర్చర్‌ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 216. 
వికెట్ల పతనం: 1–11; 2–132; 3–134; 4–149; 5–167; 6–173; 7–178.
బౌలింగ్‌: చహర్‌ 4–0–31–1; స్యామ్‌ కరన్‌ 4–0–33–3; ఇన్‌గిడి 4–0–56–1; జడేజా 4–0–40–0; చావ్లా 4–0–55–1. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: విజయ్‌ (సి) టామ్‌ కరన్‌ (బి) గోపాల్‌ 21; వాట్సన్‌ (బి) తెవాటియా 33; డు ప్లెసిస్‌ (సి) సామ్సన్‌ (బి) ఆర్చర్‌ 72; స్యామ్‌ కరన్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) తెవాటియా 17; రుతురాజ్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) తెవాటియా; జాదవ్‌ (సి) సామ్సన్‌ (బి) టామ్‌ కరన్‌ 22; ధోని (నాటౌట్‌) 29; జడేజా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 200.  
వికెట్ల పతనం: 1–56; 2–58; 3–77; 4–77; 5–114; 6–179.
బౌలింగ్‌: ఉనాద్కట్‌ 4–0–44–0; ఆర్చర్‌ 4–0–26–1; గోపాల్‌ 4–0–38–1; టామ్‌ కరన్‌ 4–0–54–1; రాహుల్‌ తెవాటియా 4–0–37–3.

మరిన్ని వార్తలు