కోహ్లి వర్సెస్‌ స్మిత్‌

3 Oct, 2020 15:07 IST|Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ ఆర్సీబీ, రాజస్తాన్‌ రాయల్స్‌లు తలో మూడు మ్యాచ్‌లు ఆడి చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఇరు జట్లు తమ తమ గత మ్యాచ్‌ల్లో భాగంగా ఆర్సీబీ సూపర్‌ ఓవర్‌లో ముంబైపై గెలవగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో రాజస్తాన్‌ ఓటమి పాలైంది. ఇక ఇరు జట్లు ఓవరాల్‌గా 20సార్లు తలపడగా రాజస్తాన్‌ 10 మ్యాచ్‌లు గెలవగా, ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గత జట్టుతోనే బరిలోకి దిగుతుండగా, రాజస్తాన్‌ మాత్రం ఒక మార్పు చేసింది. రాజ్‌పుత్‌ స్థానంలో లామ్రోర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

కోహ్లి వర్సెస్‌ స్మిత్‌
ఈ మ్యాచ్‌లో కోహ్లి-స్మిత్‌ల బ్యాటింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ప్రధానంగా టీ20 ఫార్మాట్‌లో ఎవరు అత్యుత్తమం అనే దానికి ఈ మ్యాచ్‌ ద్వారా సమాధానం దొరకవచ్చు. రాజస్తాన్‌ సారథిగా స్మిత్‌ మంచి ఫామ్‌లో కొనసాగుతుండగా, కోహ్లి ఇంకా టచ్‌లోకి రాలేదు. దాంతో ఈ మ్యాచ్‌ ద్వారా తన మునుపటి ఫామ్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. ఇదిలా ఉంచితే ఆర్సీబీలో ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లి, యజ్వేంద్ర చహల్‌లు కీలక ఆటగాళ్లు కాగా, రాజస్తాన్‌ రాయల్స్‌లో  సంజూ శాంసన్‌, స్మిత్‌, జోఫ్రా ఆర్చర్‌లు మరోసారి సత్తా చాటే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లలో విభాగంలో ఆర్సీబీ తరఫున శివం దూబే మంచి టచ్‌లో కనిపిస్తున్న తరుణంలో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆర్చర్‌ అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికరపోరు జరిగే అవకాశం ఉంది. 

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, ఇసుర ఉదాన, గుర్‌కీరత్‌ సింగ్‌మన్‌, నవదీప్‌ సైనీ, చహల్‌, ఆడమ్‌ జంపా

రాజస్తాన్‌
స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, రాబిన్‌ ఊతప్ప, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియా, టామ్‌ కరాన్‌, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, మహిపాల్‌ లామ్రోర్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌

మరిన్ని వార్తలు