మెరిసిన హోల్డర్‌..

22 Oct, 2020 21:23 IST|Sakshi

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 155 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. రాజస్తాన్‌ రాయల్స్‌ను రాబిన్‌ ఊతప్ప,  బెన్‌ స్టోక్స్‌లు ఆరంభించారు. కాగా, రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్‌ మూడో బంతికి ఊతప్ప(19; 13 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌) రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత బెన్‌ స్టోక్స్‌-సంజూ శాంసన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 56 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్‌(36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ఆడాడు. (ఐపీఎల్‌లో మద్దతు లేదు: హోల్డర్‌)

కాగా, హోల్డర్‌ వేసిన 12 ఓవర్‌లో నాల్గో బంతికి శాంసన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో రాజస్తాన్‌ 86 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అదే స్కోరు వద్ద స్టోక్స్‌(30; 32 బంతుల్లో 2ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి స్టోక్స్‌ బౌల్డ్‌ అయ్యాడు. జోస్‌ బట్లర్‌(9), స్టీవ్‌ స్మిత్‌(19)లు నిరాశపరిచారు. విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లో  బట్లర్‌ ఔట్‌ కాగా, హోల్డర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ ఔటయ్యాడు. (గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?)

హోల్డర్‌ వేసిన 19 ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించిన స్మిత్‌.. బౌండరీ లైన్‌ వద్ద మనీష్‌ పాండే క్యాచ్‌ పట్టడంతో నిష్క్రమించాడు. అదే ఓవర్‌ రెండో బంతికి రియాన్‌ పరాగ్‌(20; 12 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడే యత్నంలో వార్నర్‌ క్యాచ్‌ పట్టడంతో పరాగ్‌  ఔటయ్యాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్‌(16 నాటౌట్‌;  7 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆరెంజ్‌ఆర్మీ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లతో మెరిశాడు. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు