IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించాడు.. ఇప్పుడు రాజస్తాన్‌ జట్టులో చోటు కొట్టేశాడు!

28 Mar, 2023 11:52 IST|Sakshi

ఐపీఎల్‌-16 సీజన్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ పేసర్‌ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ స్థానాన్ని టీమిండియా పేసర్‌ సందీప్ శర్మతో రాజస్తాన్‌ భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రాజస్తాన్‌ వెల్లడించింది. అతడిని కనీస ధర రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్నట్లు రాజస్తాన్‌ తెలిపింది.

కాగా సందీప్‌ శర్మఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. ఐపీఎల్‌ పవర్‌ ప్లేల్లో అత్యధిక వికెట్లు (92 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు) తీసిన రికార్డు ఇప్పటికీ సందీప్ పేరిటే ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 108 మ్యాచ్‌లు ఆడిన సందీప్‌ 114 వికెట్లు పడగొట్టాడు. 2018 నుంచి నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సందీప్‌ ప్రాతినిథ్యం వహించాడు.  ఐపీఎల్‌-2022 మెగా వేలంకు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ అతడిని విడిచిపెట్టింది.

                                                                        

ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.  ఆ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన సందీప్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని ఐపీఎల్‌-2023 మినీ వేలంకు ముందు పంజాబ్‌ కూడా అతడిని విడిచిపెట్టింది. అయితే వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేయలేదు. కాగా  ప్రసిద్ధ్ కృష్ణ గాయం కావడంతో  మరోసారి ఐపీఎల్‌లో భాగమయ్యే అవకాశం సందీప్ శర్మకు లభించింది.

ఇక టీమిండియా స్టార్‌ ఆటగాడు, ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సందీప్‌ శర్మ అద్భుతమైన రికార్డు కలిగిఉన్నాడు. ఇప్పటి  వరకు ఐపీఎల్‌లో కోహ్లిని  7 సార్లు ఔట్‌ చేశాడు. ఐపీఎల్‌లో ఏ బౌలర్‌ కూడా కోహ్లిని ఇన్ని పర్యాయాలు ఔట్‌ చేయలేదు. ఇక ఐపీఎల్‌-16వ సీజన్‌ మార్చి 31నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: AFG vs PAK: పాకిస్తాన్‌ బౌలర్‌ రాకాసి బౌన్సర్‌.. దెబ్బకు రక్తం వచ్చేసింది! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు