పొవార్‌ మళ్లీ వచ్చాడు...

14 May, 2021 04:31 IST|Sakshi
కోచ్‌ రమేశ్‌ పొవార్, భారత టి20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (ఫైల్‌)

భారత మహిళల క్రికెట్‌ జట్టు

హెడ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌

ఎంపిక చేసిన క్రికెట్‌ సలహా కమిటీ

డబ్ల్యూవీ రామన్‌కు చుక్కెదురు  

దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌ రమేశ్‌ పొవార్‌. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్‌ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్‌ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం.   

ముంబై: భారత మహిళల క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్‌ కనిత్కర్, అజయ్‌ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్‌షికర్, హేమలత కలా, సుమన్‌ శర్మ తదితరులు ఉన్నారు.

‘పొవార్‌ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్‌ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్‌ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్‌ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్‌ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్‌–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది.  

మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత...
రమేశ్‌ పొవార్‌ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్‌ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ వరకు కాంట్రాక్ట్‌ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్‌ సెమీఫైనల్‌ వరకు చేరింది. ఇంగ్లండ్‌ చేతిలో 8 వికెట్లతో భారత్‌ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు.

అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై  మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్‌ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్‌ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్‌ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు.   

రమేశ్‌ పొవార్‌ కెరీర్‌...
ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్‌ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్‌ పొవార్‌ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్‌ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్‌లో అతను పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్, కొచ్చి టస్కర్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్‌–2 సర్టిఫికెట్‌ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్‌ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్‌సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్‌ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్‌ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది.

రామన్‌కు అవకాశం దక్కేనా?
డబ్ల్యూవీ రామన్‌ 2018 డిసెంబర్‌లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్‌ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం.

నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్‌ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే.

మిథాలీతో పొసగేనా...
త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీతో పొవార్‌ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్‌ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్‌ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ టూర్‌ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది.

అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్‌. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్‌ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్‌ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్‌ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్‌ వివరణ ఇచ్చారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు