Ramiz Raja: ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్‌ రాజా

27 Dec, 2022 15:30 IST|Sakshi

పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజాకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు పీసీబీ కొత్త బాస్‌ నజమ్‌ సేతీ.. రమీజ్‌ రాజాను ఆఫీస్‌లోకి రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రమీజ్‌ రాజానే స్వయంగా తన యూట్యూబ్‌ చానెల్‌లో పేర్కొంటూ బోరుమన్నాడు. 

''పీసీబీ మొత్తం మారిపోయింది. నజమ్‌ సేతీ ఛైర్మన్‌గా అడుగుపెట్టగానే అతని రాజకీయం మొదలైంది. తన వాళ్లకు మాత్రమే పీసీబీలోకి ఎంట్రీ అన్నట్లుగా అక్కడి ప్రవర్తన ఉంది. నాకు తెలిసి ఒక్క వ్యక్తి(నజమ్‌ సేతీ) కోసం పీసీబీ రాజ్యాంగాన్ని కూడా మార్చేసినట్లు కనిపిస్తుంది. పీసీబీ మాజీ ఛైర్మన్‌గా ఉన్న నాకు నజమ్‌ సేతీ పీసీబీ ఆఫీస్‌లోనికి రానివ్వలేదు.

ఎంత మాజీ అయినా వ్యక్తిగత ఫైల్స్‌ కొన్ని ఆఫీస్‌లోనే ఉంటాయి. వాటిని తీసుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వడం లేదు. పైగా మనుషులను పెట్టి దౌర్జన్యంగా బయటికి పంపిస్తున్నారు. మూడేళ్ల కాలానికి మొదట ఒప్పందం కుదుర్చుకొని ఏడాది తిరిగేలోపే బయటికి పంపించడం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీసీబీని కొందరు భ్రస్టు పట్టిస్తున్నారు. ఇది క్రికెట్‌ బోర్డుతో పాటు సిస్టమ్‌పై, జాతీయ జట్టుపై, జట్టు కెప్టెన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. '' అంటూ తన అక్కసును వెల్లగక్కాడు.

ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌ అయిన పాకిస్తాన్‌ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్‌ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్‌ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు.

తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్‌ సేతీ. పాక్‌ క్రికెట్‌లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదిని చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌, మాజీ క్రికెటర్‌ ఇఫ్తికార్‌ అంజుమ్‌లు ప్యానెల్‌లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్‌ రషీద్‌ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు.

చదవండి: Shahid Afridi: షాహిద్‌ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు

మరిన్ని వార్తలు