Ramiz Raja: పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా సంచలన వ్యాఖ్యలు

1 Jan, 2023 09:18 IST|Sakshi

పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా పాక్‌ దిగ్గజ పేసర్లు వసీం అక్రం, వకార్‌ యూనిస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని  చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో  స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఇద్దరితో పాటు  సలీమ్ మాలిక్ పైనా  ఆరోపణలు రావడంతో దీనిపై  జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అక్రమ్, వకార్ల పేర్లు ఉన్నాయి. 

తాజాగా రమీజ్‌ రాజా ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను.  ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ  జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని.  దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ  ఫిక్సింగ్ కేసులో చాలా మంది  ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 

2010లో  మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్  2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ  చైర్మెన్  అయ్యాక  వీళ్లెవరినీ  సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయంపై రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు. ''నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి  స్థాయి వ్యక్తులైనా  తప్పించుకోకూడదు'' అని అన్నాడు. .

చదవండి: లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి

మరిన్ని వార్తలు