Hanuma Vihari: శభాష్‌ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం

1 Feb, 2023 15:31 IST|Sakshi

Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, నిన్న (జనవరి 31) మధ్యప్రదేశ్‌తో మొదలైన క్వార్టర్‌ ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. రికీ భుయ్‌ (149), కరణ్‌ షిండే (110) అద్భుత శతకాలతో రెచ్చిపోగా.. లోయర్‌ మిడిలార్డర్‌ ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆంధ్ర టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌.. రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి, ఏపీ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 327 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్‌ దూబే (20), హిమాన్షు మంత్రి (22) ఔట్‌ కాగా.. శుభమ్‌ శర్మ (5), రజత్‌ పాటిదార్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్‌, పృథ్వీ రాజ్‌ యర్రాకు తలో వికెట్‌ పడింది. 

కాగా, రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్‌ ఆఖర్లో హనుమ విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) కనబర్చిన వీరోచిత పోరాటం మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి రోజు ఆటలో 16 పరుగుల వద్ద ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో గాయపడిన విహారి.. మణికట్టు ఫ్రాక్చర్‌ కావడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

అయితే రెండో రోజు ఆటలో కరణ్‌ షిండే, రికీ భుయ్‌ సెంచరీల తర్వాత వెనువెంటనే ఔట్‌ అయ్యాక.. ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఏపీ టీమ్‌.. 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్‌ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో (353/9) మణికట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన విహారి.. గతంలో సిడ్నీ టెస్ట్‌లో చేసిన వీరోచిత పోరాటాన్ని మళ్లీ గుర్తు చేశాడు.

కుడి చేయికి ఫ్రాక్చర్‌ కావడంతో ఎడమ చేత్తో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒంటి చేత్తో బ్యాటింగ్‌ చేసిన విహారి జట్టు స్కోర్‌కు అతిమూల్యమైన 26 పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి, జట్టు మనిషివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నొప్పిని భరిస్తూ.. ఎడమ చేతిని కాపాడుకుంటూ విహారి చేసిన బ్యాటింగ్‌ విన్యాసం చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు. గాయపడ్డాక బరిలోకి దిగిన విహారి రెండు బౌండరీలు బాదడం, అందులో ఒకటి ఆవేశ్‌ ఖాన్‌ బౌలిం‍గ్‌లో కావడం మరో విశేషం.   

మరిన్ని వార్తలు